వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ షేర్ చేస్తారా? ఇలాంటి ఎదవలు ఉంటారు
సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉండటం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో వారు తరచూ తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.
సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉండటం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో వారు తరచూ తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. తమ గురించి అందరికి చెప్పాలని.. తాము చేసే పనుల్ని షేర్ చేయాలన్న ఆలోచన వారిదైతే.. ఇలాంటి తీరు లేని సమస్యల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదెలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందన్న విషయాన్ని తెలిపే ఉదంతమిది. క్రికెట్ ఆడుకునేందుకు గ్రౌండ్ కు వెళుతున్నానంటే గ్రూపులో పోస్టు చేస్తే.. సదరు వ్యక్తి స్నేహితుడు దొంగగా మారి.. వారింట్లో చోరీకి పాల్పడిన షాకింగ్ ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
హరిక్రిష్ణ ఐటీ ఉద్యోగి. గచ్చిబౌలిలో ఉంటాడు. గాజులరామారంలో ఉంటాడు. భార్యతో పడక.. విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. వచ్చే జీతానికి.. అతడు చేసే జల్సాలకు సంబంధమే లేదు. దీనికి తోడు బెట్టింగ్ ల్లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. పుట్టెడు అప్పులతో కిందా మీదా పడుతున్నాడు. దీంతో.. అప్పుల లెక్కలు తీర్చేందుకు చోరీలు చేస్తుంటాడు.
తాను ఉన్న వాట్సాప్ గ్రూపులో తన కంపెనీలో పని చేసే మణికంఠతో మంచి పరిచయం ఉంది. వీరిద్దరు మిగిలిన గ్రూపు మెంబర్లతో కలిసి ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడుతుంటారు. వారికో వాట్సాప్ గ్రూపు ఉంది. మాదాపూర్ లో నివాసం ఉండే మణికంఠ ఇంటికి అప్పుడప్పుడు వెళుతుంటాడు హరిక్రిష్ణ. ఈ క్రమంలో తనకు అవసరమైన డబ్బు కోసం వారింట్లో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపులో చాటింగ ద్వారా జనవరి 25న క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్నాడు హరిక్రిష్ణ.
ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముఖానికి ముసుగు.. తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి వెళ్లి 18 నెలల చంటిపాపతో ఉన్న మణికంఠ సతీమణికి కత్తిని చూపించి బెదిరించాడు. ఒంటి మీద ఉన్న నగలు ఇవ్వకుంటే చంపేస్తానని చెప్పటంతో ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు కత్తి గాయమైంది. అదే అదనుగా ఆమె చేతి గాజుల్ని లాక్కొని పారిపోయాడు.
ఇంటికి వచ్చిన మణికంఠ విషయం తెలుసుకొని షాక్ తిని.. మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విచారణలో భాగంగా హరిక్రిష్ణ మీద అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఫోన్ ను చెక్ చేయగా.. దొంగలించిన గాజును ఒక షాప్ లో అమ్మిన రసీదు చూసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. చేసిన పాడు పనిని చెప్పేశాడు. దీంతో అతడి వద్ద ఉన్న 20 గ్రాముల గాజులు.. దోపిడీకి ఉపయోగించిన కత్తి.. టూ వీలర్.. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం చెప్పేదొక్కటే.. మనకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని అతిగా షేర్ చేసుకోవటం ఈ తరహా సమస్యలకు కారణమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.