ఈమె ఫోటో చూసి మోడల్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే

ఫోటో చూసినంతనే మోడల్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉంటుంది. కానీ.. ఆమె గురించి వివరాలు తెలిస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే.

Update: 2025-01-30 05:05 GMT

ఫోటో చూసినంతనే మోడల్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉంటుంది. కానీ.. ఆమె గురించి వివరాలు తెలిస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. పిన్న వయసులో ఆమె సాధించిన విజయం ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేయటమే కాదు.. ప్రపంచానికి ఆమె ఇప్పుడో హాట్ టాపిక్. ఇంతకు ఆమె సాధించిన విజయం అలాంటి ఇలాంటిది కాదు. గడిచిన నాలుగు రోజులుగా యావత్ ప్రపంచం మాట్లాడుకుంటున్న చైనా ఏఐ టూల్ డీప్ సీక్ వెనుకున్న మాస్టర్ మైండ్. అత్యంత తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

దిగ్గజ కంపెనీల ఏఐ టూల్స్ కు సవాలు విసిరేలా.. సునామీ తరహాలో విరుచుకుపడిన ఈ టెక్నాలజీ సంచలనం డీప్ సీక్ రూపకర్తల్లో కీలకంగా చెప్పాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె పేరు లువో పులి. సిచువాన్ ప్రావిన్స్ లోని ఇబిన్ గ్రామీణ ప్రాంతం నుంచి బీజింగ్ లోని ఒక సాదాసీదా విశ్వవిద్యాలయంలో ఆమె కంప్యూటర్ సైన్స్ చదివింది. మొదట్లో అర్థం కాని ఆ సబ్జెక్టు ఆమెను తెగ ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమెకు పట్టుదల పెరిగింది.

కట్ చేస్తే.. పెకింగ్ వర్సిటీలో కంప్యుటేషనల్ లింగ్విస్టిక్ ఇన్ స్టిట్యూట్ లో సీటు సొంతం చేసుకున్న ఆమె.. 2019లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఏసీఎల్ కాన్ఫరెన్స్ లో ఎనిమిది పరిశోధన పత్రాల్ని ప్రచురించటం ద్వారా సంచలనానికి తెర తీశారు. దీంతో ఆమె పలువురిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆమెకుఅలీబాబా డామో అకాడమీలో రీసెర్చర్ గా ఛాన్సు లభించింది.

అక్కడ ఆమె మల్టీ లింగ్వల్ ప్రీ ట్రైనింగ్ మోడల్ డెవలప్ మెంట్ తో పాటు ఓపెన్ సోర్స్ అలైస్ మైండ్ ప్రాజెక్టులోనూ కీలక భూమిక పోషించారు. నిజానికి ఆమె కెరీర్ లో ఈ ప్రాజెక్టు కీలకంగా చెప్పాలి. ఇదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఆమెకు డీప్ సీక్ లో చేరారు. 2022లో ఆమె ఈ సంస్థలో ఎంట్రీ ఇచ్చి.. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో తనకున్న నైపుణ్యాలతో డీప్ సీక్ వీ2 ను క్రియేట్ చేయటంలో కీలకంగా వ్యవహరించారు.

లువోలని ప్రతిభను గుర్తించిన షావోమీ ఫౌండర్ లీ జున్ ఆమె తమ సంస్థలో చేరాలని కోరారు. ఇందుకు ఆమెకు ఆఫర్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? మన రూపాయిల్లో అక్షరాల రూ.11.9 కోట్లు. అయినా ఆమె ఆ ఆఫర్ కు పెద్దగా రియాక్టు కాలేదు. కట్ చేస్తే.. ప్రస్తుం ఆమె రూపొందించిన డీప్ సీక్ ఏఐ టూల్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. అందరూ దాన్ని వినియోగించేందుకు ఎగబడుతున్నారు.

తోపు కంపెనీలు ఏళ్లకు తరబడి ఏఐ టూల్ ను వేలాది కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తే.. అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేసిన డీప్ సీక్ ఒక కొత్త పాఠంగా మారింది. చాట్ జీపీటీ.. జెమినీ.. క్లాడ్ ఏఐ లాంటి మోడళ్లకు డీప్ సీక్ సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు చైనా గురించి..అక్కడి ప్రతిభ గురించి మాట్లాడుకోవటం మొదలైంది. ఈ క్రమంలోనే లువో ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అయితే.. డీప్ సీక్ విజయాన్ని తనకు క్రెడిట్ ఇవ్వటంపై స్పందిస్తూ.. ఇది తమ టీం విజయంగా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News