కేసీయార్ జాతీయ కలలను చెరిపేసిన ఓటమి !
రెండవసారి కేసీయార్ గెలిచిన వెంటనే మూడవ ఫ్రంట్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు.
కేసీయార్ కి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది ఈ రోజుకు పుట్టిన కోరిక కాదు చాలా కాలంగా ఆయన బుర్రలో నలుగుతోంది. ఆయన తెలంగాణా ఏర్పాటు అయ్యాక ఒకసారి సీఎం అయ్యారు. 2018లో రెండవసారి గెలిచాక ఆయన తన చూపు జాతీయ రాజకీయాల మీద పెట్టారు. రెండవసారి కేసీయార్ గెలిచిన వెంటనే మూడవ ఫ్రంట్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు.
అందులో కాంగ్రెస్ బీజేపీ ఉండకూడదని కూడా భావించారు. దేశంలోని సీనియర్ నాయకులను విపక్షలను కేసీయార్ కలిశారు. ఆ కోరిక ఇంకా ఎక్కువగా ఉండడంతోనే ఆయన టీయారెస్ పార్టీని కాస్తా బీయారెస్ గా మార్చేశారు. అలా 2022 విజయదశమి వేళ పార్టీ పేరు మార్చి ఇక జాతీయ పార్టీ అయింది అని కూడా ప్రకటించేశారు.
అయితే మూడవ ఫ్రంట్ అని హడావుడి చేసినా లేక బీయారెస్ అని కేసీయార్ బిగ్ సౌండ్ చేసినా అనుకున్న స్పందన అయితే రాలేదు అనే చెప్పాలి. జాతీయ స్థాయిలో కీలక నేతలు అంతా కూడా అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటములలో చేరిపోయారు. ఆ విధంగా కేసీయార్ జాతీయ ప్రయత్నాలు మాత్రం తగిన ఫలితం అయితే దక్కలేదు.
అంతవరకూ ఎందుకు పక్కన ఉన్న కర్నాణక మాజీ సీఎం కుమారస్వామి బీయారెస్ ప్రకటన టైం లో వచ్చిన వారు ఇపుడు చూస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇక కేసీయార్ నేల విడిచి సాము చేశారు అన్న విమర్శలు వచ్చాయి. ఆయన దేశంలోని ఇతర రాష్ట్రాలకు తిరిగి జాతీయ స్థాయిలో బీయారెస్ ని బలీయమైన శక్తిగా మలచాలని చూశారు. కానీ తెలంగాణాలో బీయారెస్ కి వస్తున్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు.
అదే టైం లో దానికి తగిన సమయంలో చికిత్స కూడా చేయలేకపోయారు. ప్రత్యర్ధి పార్టీల బలాన్ని తక్కువ అంచనా వేసుకోవడం, తాము తప్ప ఎవరు గెలిచేది అంటూ ధీమా గా ఉండడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఇక బీజేపీకి బీయారెస్ బీ టీం అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి కూడా మంచి స్పందన లభించింది అని అంటున్నారు.
ఇంకో వైపు కేసీయార్ కుమార్తె కవిత విషయంలో వచ్చిన లిక్కర్ కుంభకోణం ఆరోపణలలో ఆమెను అరెస్ట్ చేయకుండా బీజేపీ కాపాడింది అన్నది కూడా బలంగా జనంలోకి పోయింది. దాన్ని కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చింది. మోడీ అయితే ఎన్డీయేలో కేసీయార్ చేరుతానని అన్నారని తామే దూరం పెట్టామని కూడా చెప్పడంతో ఆ ఆరోపణలకు మరింత ఊతం ఇచ్చేలా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది.
ఇక కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత లభించిన బూస్ట్ తోనే తెలంగాణాను కూడా గెలుచుకుంది. ఆరు నెలల క్రితం వరకూ ఎలాంటి హడావుడి లేదు. ఇదంతా ఒక మ్యాజిక్ గా సాగిపోయింది. దీంతో కేసీయార్ రెండు సీట్లలో పోటీ చేస్తే గజ్వేల్ లో విజయం వైపున ఉన్నారు. కామారెడ్డిలో మాత్రం ఆయన ఓటమి బాటన ప్రయాణిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీయార్ మిగిలిపోవడం అంటే రాజకీయ విషాదమే అంటున్నారు.