తెరుచుకున్న జగన్నథుడి భాండాగారం... అందరి దృష్టీ ఆ కర్రపెట్టేలపైనే!
దీంతో... ఆ ఐదు కర్రపెట్టెల్లో ఎంత సంపద దాగుందనేది ఆసక్తిగా మారింది.
సుమారు 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో... ఆ ఐదు కర్రపెట్టెల్లో ఎంత సంపద దాగుందనేది ఆసక్తిగా మారింది.
అవును... 46 ఏళ్లక్రితం 1978లో చివరిసారిగా తెరిచిన పూరీ జగన్నాథుడి రత్న భాండాగరం తాజాగా ఈరోజు తెరుచుకుంది. వాస్తవానికి ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వరకూ జగన్నాథ, బలభద్ర, సుభదరలు ఆలయం వెలుపలఏ ఉంటారు. ఈ నేపథ్యంలో అధికరులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఎలాగూ గది తలుపులు తెరుస్తున్నందు వల్ల భాండాగరం లెక్కింపులతో పాటు ఆ గదిలోని మరమ్మతులు కూడా అప్పటిలోగా పూర్తయిపోతుందా అనేదీ ఆసక్తిగా మారింది. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పైగా జగన్నాథుని భాండాగారంలో విషసర్పాలు ఉంటాయన్న సందేహాలు బలంగా ఉన్న నేపథ్యంలో... ఈ భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఈ సందేహాల నడుమ స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, వైద్యులు కూడా అధికారులతో పాటు లోపలికి వెళ్లినవారిలో ఉన్నారని అంటున్నారు.
వాస్తవానికి పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. అయితే పూర్వం ప్రతీ మూడేళ్లకో, ఐదేళ్లకో ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. ఈ క్రమంలోనే చివరి సారిగా 1978లో లెక్కించారు. నాడు ఈ భాండాగరంలో సంపదను లెక్కించడానికి సుమారు 70 రోజులు పట్టిందని చెబుతారు.
అయితే అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో సందేహాలున్నాయనేది తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భాండాగారం తెరచి సంపద లెక్కించాలని ఆదేశించింది.. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్ధించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జగన్నాథుని భాండాగారాన్ని తెరిచారు.