తెలంగాణలో పసుపు జెండా ఎగురవేస్తా.. తీగల వైరల్ స్టేట్మెంట్..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంసంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలామంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు జర్నీ వద్దు అంటూ హస్తానికి షేక్ హ్యాండ్ ఇక మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమ పార్టీలకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పక్షానికి ఎప్పుడో చేరిపోయారు. అయితే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంటే ఒక్క ఎమ్మెల్యే మాత్రం నేను టిడిపిలో చేరుతాను అంటూ అందరినీ షాక్ కి గురి చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంసంగా మారింది. ఈరోజు హైదరాబాదులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కృష్ణారెడ్డి.. తెలంగాణలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చంద్రబాబును కలిశానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మాజీమంత్రి,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా తీగ కృష్ణారెడ్డి తో పాటు చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి మనవరాలు, రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన శ్రేయ రెడ్డి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించడానికి వారు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అని డిక్లేర్ చేశారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. దివంగత నేత ఎన్టీ రామారావు తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైంది అని గుర్తు చేసుకున్న తీగల.. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే జరిగిందని అన్నారు. తెలంగాణలో తిరిగి టిడిపి పాలన రావలసిన అవసరం ఎంతో ఉందని అందుకే త్వరలో పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెప్పారు. తీగల గతంలో కూడా చైర్మన్ గా వ్యవహరించడంతోపాటు ఉమ్మడి ఆంధ్ర లో హైదరాబాద్ నగర్ మేయర్ గా కూడా ఉన్నారు. 2014లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తీగల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత కారుకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇప్పుడు సొంత గూటికి తిరిగి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణలో టిడిపి కనుమరుగైపోతుంది అనుకున్న సమయంలో తీగల చేసిన ఈ వ్యాఖ్యలు తిరిగి పార్టీకి ఊపిరి పోస్తున్నాయి.