ఈసారి ఈ నేతకు జగన్‌ 'కరం' చాచడం లేదా?

కాగా ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న చీరాల అభ్యర్థిని మార్చొచ్చని ప్రచారం జరుగుతోంది

Update: 2024-01-31 08:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటì కే నాలుగు విడతల్లో ఆయన అభ్యర్థులను జాబితాలను ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఐదో విడత జాబితా ఉంటుందని టాక్‌ నడుస్తోంది.

కాగా ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న చీరాల అభ్యర్థిని మార్చొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇంచార్జిగా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌ ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలుచుకున్న 23 నియోజకవర్గాల్లో చీరాల కూడా ఒకటి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన కరణం బలరాం ఆ తర్వాత కొంత కాలానికే వైసీపీ తలుపు తట్టారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాల నుంచి తనకు బదులుగా తన కుమారుడిని పోటీ చేయించే యోచనలో కరణం బలరాం ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల వరకు చీరాల వైసీపీ ఇంచార్జిగా ఉండగా.. ఆయన్ను పర్చూరు ఇంచార్జిగా పంపారు.

అయితే చీరాల నుంచి రెండుసార్లు గెలుపొంది మూడోసారి ఓడిపోయిన ఆమంచి తాను మరోసారి చీరాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇటీవల తన ఆత్మీయులు, కార్యకర్తలతో చీరాలలో సమావేశం కూడా నిర్వహించారు. వైసీపీ అధిష్టానం తనను పర్చూరు నుంచి పోటీ చేయాలని కోరుతుందని.. అయితే తాను చీరాల నుంచే పోటీ చేస్తానని అనుచరులకు చెప్పారు.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా కరణం బలరాంను ఈ ఎన్నికలకు ఆగాలని కోరినట్టు చెబుతున్నారు. చీరాలలో చేనేత సామాజికవర్గం జనాభా ఎక్కువ. కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఇక ఆమంచి కృష్ణమోహన్‌ కాపు సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న పోతుల సునీతది కూడా చీరాలే. ఆమె చేనేత సామాజికవర్గానికి చెందినవారు.

చీరాల నుంచి మొదట కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌ పోటీ చేస్తారని వైసీపీ పెద్దలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనూ మార్పులు చేయాలని జగన్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా కరణంను పక్కనపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్‌ స్వయంగా కరణంకు చెప్పినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి కరణం బలరాం.. అద్దంకి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అద్దంకిలో కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌ లను గతంలో గొట్టిపాటి రవికుమార్‌ ఓడించారు. గతంలో వైసీపీలో ఉన్న గొట్టిపాటి రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అద్దంకి సీటును ఇప్పటికే జగన్‌ హనిమిరెడ్డికి కేటాయించారు. దీంతో అద్దంకిలో పోటీకి కరణం బలరాంకు దారులు మూసుకుపోయినట్టే. ఇప్పుడు చీరాలలో కూడా దారులు మూసుకుపోతే కరణం బలరాం ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News