బాత్రూంలో టూత్ బ్రష్ ఉంచే అలవాటుందా? మీరిది చదవాల్సిందే
అందరి బ్రష్ లు ఒకేచోట ఉండటం లాంటివి చేస్తుంటాం. కానీ.. అలాంటి తీరుతో జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నారు సిద్ధిపేటకు చెందిన విద్యార్థులు.
రోజువారీగా చేసే కొన్ని పనులు.. ఏళ్లకు ఏళ్లుగా అలవాటైన వాటిల్లో చోటు చేసుకునే తప్పులు.. ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం తెలిసినప్పుడు ఒకలాంటి విస్మయానికి గురవుతాం. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. వాష్ రూంలో టూత్ బ్రష్ లను ఉంచటం.. అందరి బ్రష్ లు ఒకేచోట ఉండటం లాంటివి చేస్తుంటాం. కానీ.. అలాంటి తీరుతో జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నారు సిద్ధిపేటకు చెందిన విద్యార్థులు. బాత్రూంలో ఉంచే టూత్ బ్రష్ ల కారణంగా ఎదురయ్యే సమస్యల్ని వారు చేసిన పరిశోధనలో గుర్తించారు. ఈ సందర్భంగా వారు ఇస్తునా సలహాలు.. సూచనలు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు.. ఒక మోస్తరు నగరాలు.. పట్టణాల్లో అటాచ్డ్ బాత్రూంలు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. దీంతో.. బాత్రూంలోనే టూత్ బ్రష్ లను ఉంచేయటం అలవాటుగా మారింది.దీనిపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన ప్రధాన అంశం.. వాష్ రూంలో టూత్ బ్రష్ లను ఉంచటం కారణంగా కమోడ్ ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్ లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లోకి వ్యాపిస్తుందని గుర్తించారు. అక్కడ ఉండే బ్రష్ లపైకి ఎక్కువగా చేరుతాయని నిర్దారణ అయ్యింది.
ఈ సందర్భంగా బాత్రూంలో ఉంచిన బ్రష్ లను.. వాష్ రూంకు దూరంగా.. ఎండ తగిలే చోట టూత్ బ్రష్ లను ఉంచిన వాటిని పరిశీలించినప్పుడు.. ఎండ తగిలే చోట పెట్టిన బ్రష్ ల్లో సూక్ష్మ క్రిములు నశిస్తున్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఇంట్లోని వారి అందరి బ్రష్ లను ఒకే చోట పెట్టటం కూడా సరికాదని గుర్తించారు. దాదాపు 45 రోజులకు పైనే సాగిన ఈ పరిశోధన మొత్తం కాలేజ్ సూక్ష్మ జీవశాస్త్ర ఇన్ చార్జ్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో సాగింది.
కాలేజీకి చెందిన స్టూడెంట్స్.. లెక్చరర్స్ వినియోగిస్తున్న వారి వంద టూత్ బ్రష్ ల నమోనాల్ని సేకరించి.. వాటిల్లో బ్యాక్టీరియా ఉందా? ఏయే రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయన్న దానిపై రిసెర్చ్ చేశారు. ఈ సందర్భంగా మూడు బ్యాక్టిరీయాలు ప్రధానంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించారు.
మొదటగా స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా యాభై శాతం ఉంటున్న విషయాన్ని గుర్తంచారు. స్టెఫైలోకోకస్ ఆర్యస్ బ్యాక్టీరియా 40 శాతం ఉన్నట్లుగా తేల్చారు. ఇక.. మూడో బ్యాక్టీరియా ఎస్చెరిియా కోలీ (ఈ-కోలి) బ్యాక్టీరియా 20 శాతం ఉంటున్న విషయాన్ని గమనించారు. వీటి కారణంగా పిప్పి పళ్లు.. దంతాల క్షీణత.. అరుగుదలకు స్ట్రెఫ్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమైతే.. స్టెఫైలోకోకస్ ఆర్యస్ బ్యాక్టీరియా కారణంగా గొంతు సమస్యలు.. మౌత్ అల్సర్స్ సమస్యలు వస్తుంటే.. ఈ - కోలి బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని గుర్తించారు.
ఈ క్రమంలో మీ ఇంట్లో వాడే టూత్ బ్రష్ లను వాష్ రూంలకు దూరంగా.. ఎండ తగిలే చోటో వేర్వేరుగా ఉంచటం మంచిదంటున్నారు. అలా కుదరని పక్షంలో.. యూవీ లైట్ బాక్స్ లో 5-10 నిమిషాలు ఉంచటం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించారు. ఏం చేయాలన్నది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సిందే.