ట్రేడింగ్ లాభాలపై ఈ పన్ను బాదుడేంది నిర్మలమ్మ?

కరోనా తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య ఎంతలా పెరిగిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.

Update: 2024-07-24 07:03 GMT

కరోనా తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య ఎంతలా పెరిగిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మదుపు చేసే విషయంలో చోటు చేసుకున్న మార్పులతో పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. అయితే.. వీటిలో వచ్చే లాభాల మీద పన్ను బాదుడు భారీగా పెంచేస్తూ కేంద్రమంత్రి నిర్మలమ్మ నిర్ణయం తీసుకున్నారు. స్వల్పకాలిక అమ్మకాలకు.. దీర్ఘకాలిక అమ్మకాలకు పన్ను పోటు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పలువురు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

క్యాపిటల్ మార్కెట్ మీద పెంచిన పన్నుపోటు కారణంగా కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయాలు వస్తాయని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం అదనంగా పెంచిన పన్ను కారణంగా దగ్గర దగ్గర రూ.15 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక.. కొత్త బడ్జెట్ లో పేర్కొన్న పన్ను భారం విషయానికి వస్తే.. తొలుత దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు విధిస్తున్న పది శాతం పన్నును 12.5 శాతం పన్నుగా పెంచారు.

ఏడాదికిపైగా ఉంచుకొని అమ్మే లిస్టెడ్ కంపెనీల షేర్లు.. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల వంటి ఫైనాన్షియల్ అసెట్స్.. అమ్మకాలపై వచ్చే లాభాలపై విధించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 2.5 శాతం పెరిగింది. అదే సమయంలో అన్ లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్.. నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ను రెండేళ్ల పాటు ఉంచుకొని అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అన్ లిస్టెడ్ బాండ్స్.. డిబెంచర్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. అంతేకాదు.. వీటి అమ్మకాలపై వచ్చే లాభాలను ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ఆధారంగా విధిస్తారు.

ఇక.. ఏడాది కంటే తక్కువ సమయం ఉంచుకొని అమ్మే లిస్టెడ్ కంపెనీల షేర్లు.. మ్యూచువల్ఫండ్స్ యూనిట్లు.. బిజినెస్ ట్రస్టుల యూనిట్లపై వచ్చే లాభాలపై విధించే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ప్రస్తుతం 15 శాతంగా ఉంది. దీన్ని ఇప్పుడు 20 శాతానికి పెంచారు. ఈ మార్పులు క్యాపిటల్ మార్కెట్ లో పెట్టుబడులను మరింత పెరుగుతాయన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి నిర్మల వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి డెవివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ సైతం భారం కానుంది. ఆప్షన్ అమ్మకాలపై విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇప్పటివరకు 0.0625 శాతంగా ఉంది. దీన్ని 0.1 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆప్షన్ ప్రీమియంపై ఈ పన్ను విధిస్తారు. ఫ్యూచర్ మార్కెట్లో సెక్యూరిటీల అమ్మకాలపై విధించే ఎస్ టీటీనీ 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. ఇటీవల కాలంలో డెరివేటివ్స్ ట్రేడింగ్ లో పెద్ద ఎత్తున రిటైల్ ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్న నేపథ్యంలో.. ఆ తీరును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. దాని ప్రభావం పెద్దగా ఉండదన్న వాదన వ్యక్తమవుతోంది.

ఇన్ని వడ్డింపులతో పాటు మరో వడ్డింపును కేంద్ర మంత్రి నిర్మలమ్మ పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీలు చేసే షేర్ల బై బ్యాక్ మీదా పన్ను వడ్డింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు బైబ్యాక్ పన్ను భారం కంపెనీలు చూసుకునేవి. అక్టోబరు ఒకటి నుంచి మాత్రం ఈ భారం వాటాదారులపై పడనుంది.ఈ నేపథ్యంలో షేర్ల బై బ్యాక్ లు బాగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారిపై మోపిన పన్నుభారం నిరాశకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News