బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ : ఇక ముందు అంతేనా...!?
దాని తరువాత వచ్చిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు ఏకంగా కేసీఅర్ కుమార్తె కవిత మీద లిక్కర్ కేసు పడింది.
తెలంగాణా రాష్ట్ర సమితి అని పేరు గులాబీ పార్టీకి ఎంతగానో కలిసి వచ్చింది. ఆ విధంగా పేరు ఉన్నపుడు ఎన్నో విజయాలు దక్కాయి. ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా పార్టీ ముందుకు సాగిపోయింది. అయితే 2022 విజయదశమి రోజున తెలంగాణా రాష్ట్ర సమితి పేరు కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.
దాని తరువాత వచ్చిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు ఏకంగా కేసీఅర్ కుమార్తె కవిత మీద లిక్కర్ కేసు పడింది. అంతే కాదు విపక్షాలు ఒక్కసారిగా పుంజుకుని అధికార బీఆర్ఎస్ మీద దాడిని పెంచేశాయి. చివరికి గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా అధికారమే కాకుండా పోయింది.
దానికి కారణం పేరులోనే అంతా ఉందని ఈ రోజుకీ బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతూంటారు. ఇదిలా ఉంటే బీఆర్ ఎస్ అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ అంతర్మధనం మొదలైంది అని అంటున్నారు. ఇటీవల కేటీఆర్ నిర్వహించిన పార్టీ సమావేశంలో సైతం కొందరు నేతలు ఇదే విషయం మీద మాట్లాడారు.
బీఆర్ఎస్ పేరు వద్దు టీఆర్ఎస్ గానే ఉంచాలని కోరుకున్నారు. టీఆర్ ఎస్ లో తెలంగాణా అన్న ఆత్మ ఉందని చాలా మంది నేతలు అనడం విశేషం. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు కూడా ఇదే రకమైన విశ్లేషణ చేశారు. దాని మీద ఎటూ బీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచిస్తుంది అని అనుకోవాలి.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అని పేరు పెట్టాక జాతీయ స్థాయిలో అయినా ఏమైనా కలసివచ్చిందా అంటే అదీ లేదు అని అంటున్నారు. కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారినపుడు మద్దతుగా నిలిచిన కర్నాటక పార్టీ జేడీఎస్ ఇపుడు బీజేపీకి మిత్రపక్షంగా మారి వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇక మహారాష్ట్ర నేతలు కూడా బీఆర్ఎస్ కి దూరం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఒడిషాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయన తాజాగా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఏపీ విషయానికి వస్తే బీఆర్ఎస్ కి ఎదుగూ బొదుకూ లేని విధంగా ఉంది. తోట చంద్రశేఖర్ అన్న నాయకుడు ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కానీ ఇపుడు ఆయన హడావుడి కూడా కనిపించడంలేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో కూడా బీఆర్ఎస్ ఎటూ తేల్చడంలేదు.
దీనికంటే ముందు ఇంట గెలవాల్సి ఉంది. అంటే తెలంగాణాలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పటప్పట్లో కేసీఆర్ కూడా తెలంగాణా దాటి రాజకీయాలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. ఏతా వాతా చూస్తే కనుక బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ గా మారుస్తారా ఆ విధంగా తెలంగాణా వాదంతో మరోమారు గర్జిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.