ఏమిటీ స్టార్ గేట్ ప్రాజెక్టు.. ఇందులో పెట్టే పెట్టుబడుల లెక్క తెలుసా?
ఇప్పుడు చెప్పే ‘స్టార్ గేట్’ రాబోయే రోజుల్లో అదే పనిగా వినిపించటమే కాదు.. ఎన్నో అద్భుతాలకు వేదికగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఇప్పుడు చెప్పే ‘స్టార్ గేట్’ రాబోయే రోజుల్లో అదే పనిగా వినిపించటమే కాదు.. ఎన్నో అద్భుతాలకు వేదికగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. కృత్రిమ మేధస్సుకు పెద్దపీట వేసేందుకు వీలుగా ఒక బాహుబలి కంపెనీని క్రియేట్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. దీనికోసం పెడుతున్న పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.43 లక్షల కోట్లు. డాలర్లలో చెప్పాలంటే 500 బిలియన్ డాలర్లు.
తాజాగా ట్రంప్ 2.0 సర్కారు స్టార్ గేట్ కు ఓకే చెప్పింది. ఇందులో సాఫ్ట్ బ్యాంక్.. ఓపెన్ ఏఐ.. ఒరాకిల్ సంస్థల అధిపతులతో వైట్ హౌస్ లో ప్రత్యేక భేటీని నిర్వహించారు ట్రంప్. కృత్రిమ మేధస్సును మరింత విస్త్రతం చేయటానికి.. లక్ష ఉద్యోగాల్ని క్రియేట్ చేసేందుకు వీలుగా ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా 100 బిలియన్ డాలర్లు పెడతారు. మన రూపాయిల్లో రూ.8.6లక్షల కోట్లు. రానున్న నాలుగేళ్లలో ఈ పాజెక్టు కోసం పెట్టే పెట్టుబడి ఏకంగా రూ.43 లక్షల కోట్లు.
ఈ ప్రాజెక్టుతో చైనా కంటే మిన్నగా కృత్రిమ మేధస్సు ను వ్రద్ధి చేయాలన్నది ట్రంప్ ఆలోచన. స్టార్ గేట్ పేరుతో ఏర్పాటు అయ్యే ఈ కొత్త కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటు మీద ఫోకస్ పెట్టనుంది. దీని ద్వారా ప్రముఖ టెక్ కంపెనీలు అమెరికాలోని డేటా సెంటర్లలో పెట్టుబడులుపెట్టేలా ప్రోత్సహిస్తారు. దిగ్గజ కంపెనీలైన ఒరాకిల్.. సాఫ్ట్ బ్యాంక్.. ఓపెన్ ఏఐలతో కలిసి ట్రంప్ ఏర్పాటు చేయిస్తున్న ఈ కొత్త కంపెనీ భవిష్యత్తు కృత్రిమ మేధస్సు అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
స్టార్ గేట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒరాకిల్.. సాఫ్ట్ బ్యాంక్.. ఓపెన్ ఏఐలు కూడా నిధులు సమకూరుస్తాయి. మరిన్ని కంపెనీలు కూడా ఈ సంస్థలో చేరే వీలుంది. అమెరికాలో కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాల్ని భారీగా పెంచేటయంతో పాటు.. ఈ రంగంలో ఇతర దేశాల కంటే మిన్నగా మారటం కూడా ఒక లక్ష్యం. ఈ కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానురియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని.. తనకు భూమి విలువ తెలుసన్నారు. ఏరఐ డేటా సెంటర్ల భవనాలు కూడా చాలా విలువైనవని.. ఎంతోమందికి ఉపాధిని అందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏమైనా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే ఇంత భారీ ప్రాజెక్టుకు తెర తీయటం ట్రంప్ నకు మాత్రమే సాధ్యమవతుందన్న మాట వినిపిస్తోంది.