ముస్లింల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు... నిక్కీ హేలీ కామెంట్స్ పీక్స్!

ట్రంప్‌ ప్రకటనను తప్పుపట్టిన శ్వేతసౌధం... ఇస్లోమోఫోబియాకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్‌ చర్యలు తీసుకున్నారని, ఇదే విధానాన్ని కొనసాగిస్తారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ వెల్లడించారు.

Update: 2023-10-30 07:40 GMT

కులాలు, మతాల టాపిక్స్ ఎత్తుతూ ప్రజల మధ్య అంతరాలు సృష్టించి తమ పబ్బం గడుపుకునే నీతిమాలిన ఎత్తులు చాలా మంది రాజకీయ నాయకులు వేస్తుంటారని నిత్యం లౌకిక వాదుల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి! మనుషుల మధ్య కుల, మత గోడలే వారి పెట్టుబడులని.. విభజించు పాలించూ సూత్రాన్ని అవపోసన పట్టుకుని బ్రతుకుతుంటారని అంటుంటారు. అయితే ఈటైపు ఆలోచనకు భారతదేశం, అగ్రదేశం అనే తారతమ్యాలేవీ ఉండవని నిరూపించే పనికి పూనుకున్నట్లున్నారు డోనాల్డ్ ట్రంప్!

అవును... ఉగ్రవాదులంతా ముస్లింలే అయ్యి ఉండొచ్చు కానీ, ముస్లింలంతా ఉగ్రవాదులు కాదనే ప్రాథమిక ఆలోచన ఉంటే మతప్రాతిపదికన వివక్ష ఉండదని అంటుంటారు. ఈ సమయంలో తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల పౌరులకు ప్రయాణ నిషేధాన్ని మళ్లీ తీసుకువస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు... అధ్యక్షుడైన తొలిరేజే ఆ నిషేధాన్ని పునరుద్ధరిస్తానని తేల్చి చెప్పారు.

తాజాగా రిపబ్లికన్‌ యూదు కూటమి వార్షిక సమావేశంలో ప్రసంగించిన ఆయన... "ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా?" అని ప్రశ్నించారు. అనంతరం... తాను రెండోసారి అధ్యక్షుడైతే తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించారు. అదేవిధంగా.. బాంబు పేలుళ్లను ఇష్టపడే వ్యక్తులు అమెరికాలో ప్రవేశించాలని మనం కోరుకోవద్దని ఆయన సూచించారు.

ఇదే సమయంలో... గతంలో తమ ప్రభుత్వ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ చర్య అద్భుత విజయం సాధించిందని చెప్పుకున్న ట్రంప్... తన హయాంలో ఒక్క దుర్ఘటన జరగకపోవడానికి చెడు వ్యక్తులను దేశంలోకి అనుమతించకపోవడమే కారణం పేర్కొన్నారు. దీంతో... ఈ విషయాలపై వైట్ హౌస్ స్పందించింది. ఇందులో భాగంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది.

ట్రంప్‌ ప్రకటనను తప్పుపట్టిన శ్వేతసౌధం... ఇస్లోమోఫోబియాకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్‌ చర్యలు తీసుకున్నారని, ఇదే విధానాన్ని కొనసాగిస్తారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ వెల్లడించారు.

కాగా... తన హయాంలో ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సిరియా, సోమాలియా, యెమెన్‌, సూడాన్‌ వంటి దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ఆ సంగతి అలా ఉంటే... అమెరికా అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న ఇండియన్-అమెరియన్ నిక్కీ హేలీ తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యంలో గందరగోళం నెలకొంటుందని, ప్రతీకార ఘటనలూ వెలుగు చూడొచ్చని తెలిపారు. అలాంటి వాతావరణం అమెరికాకు ఎంతో ప్రమాదకరమైనదని ఆమె హెచ్చరించారు.

ఇదే క్రమంలో... ఒకవేళ జో బైడెన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైనాకూడా.. అమెరికా భరించలేదని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... బైడెనే ఓ చెడ్డవాడు అనుకుంటే, కమలా హారిస్ అంతకుమించిన రాక్షసి అని సంచలన కామెంట్స్ చేశారు. అలాంటి కమలా హారిస్ అధ్యక్షురాలైతే.. మనుగడ సాగించలేమని నిక్కీ హేలీ పేర్కొన్నారు.

Tags:    

Similar News