బ్యాంకునే మింగిన మహిళకు మరణశిక్ష... ఎవరీ బిలియనీర్?
తాజాగా ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పు చేస్తే ఒక రోజు అటు ఇటుగా ఎప్పటికైనా బయటపడుతుందడానికి ఒక ఉదాహరణ తెరపైకి వచ్చింది
తాజాగా ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పు చేస్తే ఒక రోజు అటు ఇటుగా ఎప్పటికైనా బయటపడుతుందడానికి ఒక ఉదాహరణ తెరపైకి వచ్చింది. బ్యాంకులకు తప్పుడు రుణపత్రాలు సమర్పించి ఆమె డ్రా చేసిన డబ్బుల మొత్తం ఆ దేశ జీడీపీలో ఏకంగా మూడు శాతానికి సమానం అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో.. ఎవరీ మహిళ, ఈమె చేసిన స్కాం ఏమిటి, ఆ స్కాంకు వేసిన స్కెచ్ ఎలాంటిది అనే విషయాలు తెరపైకి వచ్చాయి!
అవును... వియత్నాంలో తప్పుడు రుణపత్రాలను సమర్పించడం.. డబ్బు డ్రా చేసుకోవడం చేసి దాదాపు ఒక బ్యాంకు సొమ్ము మొత్తం మింగేసింది ట్రూంగ్ మై లాన్. ట్రూంగ్ కుటుంబానికి వియత్నాంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన వాన్ థిన్ ఫాట్ గ్రూప్ అనే సంస్థ ఉంది.. అయితే ఆమె తొలుత తన తల్లితో కలిసి కాస్మొటిక్స్ వ్యాపారం చేసింది. ఈ క్రమంలో 1990 నుంచి ఆమె మెల్లగా భూములు, హోటళ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది.
వాస్తవానికి వియత్నాంలో భూములు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయాలంటే అక్కడి అధికారులతో మంచి సంబంధాలు కలిగిఉండాలి. దీంతో... ట్రూంగ్ ఈ మార్గంలో అత్యంత వేగంగా ఎదిగి.. 2011 నాటికి దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా నిలిచింది. ఇదే సమయంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులను పుష్కలంగా సంపాదించింది.
ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన "సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్"(ఎస్.సీ.బీ)ను 2012 నుంచి 2022 వరకు నియంత్రించింది. వాస్తవానికి ఆమె ఆధీనంలోని మూడు బ్యాంకులు దివాలా తీయగా.. వాటిని విలీనం చేసే ఈ ఎస్.సీ.బీని ఏర్పాటుచేసింది. ఇదే సమయంలో... ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి బ్యాంక్ లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదు.
దీంతో వందల కొద్దీ షెల్ కంపెనీలను ఏర్పాటుచేసి సుమారు 90శాతం వాటాలను దక్కించుకొని అంతా తన గుప్పిట్లో ఉంచుకొంది. ఈ క్రమంలోనే 2012 నుంచి 2017 వరకు 368 రుణాలు.. 2018 నుంచి 2022 వరకు మరో 916 తప్పుడు పత్రాలతో సుమారు 12.5 బిలియన్ డాలర్లను ఆమె దారి మళ్లించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో ఇది 93 శాతానికి సమానం.
ఇలా అప్రహితంగా సాగిన ఆమె ఆర్ధిక నేరాల పరంపరల ఫలితంగా... ఆమె మొత్తం 44 బిలియన్ డాలర్ల (రూ.3.6 లక్షల కోట్లు) స్కాం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో... ఆగ్నేయాసియాలోనే ఇది అతిపెద్ద స్కాం అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక ఈమే చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణలు కూడా రికార్డు సృష్టించాయి.
ఇందులో భాగంగా... 80 మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టగా.. 2,700 మంది సాక్షులను విచారించారు. ఇదే సమయంలో... పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు, 200 మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. ఇక దాదాపు ఆరు టన్నుల బరువైన 104 బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. 1,000 ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో ట్రూంగ్ కు ఇప్పుడు న్యాయస్థానం మరణదండన విధించింది.