టీటీడీ బోర్డులోని 23 మంది ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ బోర్డును తాజాగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ బోర్డును తాజాగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మంది సభ్యుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారు. వివిధ రంగాలకు చెందిన వారికి ఇందులో భాగం కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి సముచిత గౌరవాన్ని కల్పించారు. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలకుచెందిన వారికి చోటిచ్చారు. ఇక.. టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అందరి అంచనాలకు తగ్గట్లే ప్రముఖ న్యూస్ చానల్ టీవీ5 అధినేత బీఆర్ నాయుడికి కట్టబెట్టారు. అంతేకాదు.. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం పొందిన వారు.. తాజా బోర్డులోనూ చోటు దక్కించుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇక.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన వ్యక్తిని తొలిసారి టీటీడీ బోర్డులో నియమించటం ఆసక్తికరంగా మారింది.
మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తును టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ ను మినహాయిస్తే మొత్తం 23 మంది బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు అవకాశం లభించింది. వారు ఎవరంటే..
1. జ్యోతుల నెహ్రు (జగ్గంపేట)
2. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు)
3. ఎంఎస్ రాజు (మడకశిర)
అదే సమయంలో టీడీపీకి చెందిన మరికొందరికి కూడా చోటు దక్కింది. కేంద్ర మాజీ మంత్రిగా వ్యవహరించిన పనబాక లక్ష్మికి టీటీడీ బోర్డులో సభ్యురాలిగా అవకాశం కల్పించారు. అంతేకాదు.. తొలి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న తెలంగాన టీడీపీకి చెందిన నన్నూరి నర్సిరెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. రాజమండ్రికి చెందిన కోటేశ్వరరావుకు.. నంద్యాల జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్.. పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా క్రిష్ణమూర్తి, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవికి అవకాశం లభించింది.
జంగా క్రిష్ణమూర్తి విషయానికి వస్తే ఎన్నికల వేళ గుజరాల ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ..సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు టీటీడీ సభ్యుడిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేనకు టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బి.మహేంద్రరెడ్డిని సభ్యుడిగా నియమించారు.2009 నుంచి పవన్ కల్యాణ్ వెంటే ఉంటూ.. ఎలాంటి పదవుల్ని ఆశించకుండా పార్టీకి పని చేసిన ఆయనకు ఎట్టకేలకు పదవి దక్కింది.
అంతేకాదు.. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ (ఆమె భర్త జనసేనపార్టీ ట్రెజరర్ గా ఉన్నారు)కి చోటు కల్పించారు.పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన సినీ కళా దర్శకుడు ఆనంద్ సాయికి టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం లభించింది. వివిధ రంగాలకు చెందిన పలువురికి టీటీడీ బోర్డులో అవకాశం లభించింది. అయితే.. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరించిన కొందరికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులోనూ అవకాశం లభించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
అలాంటి లక్కీ ఛాన్స్ పొందిన వారు ఎవరంటే..
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.. జంగా క్రిష్నమూర్తి. అయితే.. వీరిద్దరూ అప్పట్లో వైసీపీలో ఉండేవారు. తాజాగా టీడీపీలో ఉండటంతో వారికి అవకాశం లభించింది.
- జగన్ ప్రభుత్వంలోబోర్డులో చోటు దక్కించుకున్న సౌరభ్ బోరా.. మరోసారి సభ్యుడయ్యారు. టీటీడీ సభ్యుడైన రామ్మూర్తి బ్రదర తిరుప్పూర్ బాలు గతంలోనూ బోర్డు సభ్యుడిగా వ్యవహరించారు.
- కేతన్ దేశాయ్ కు వైసీపీ ప్రభుత్వంలో బోర్డు సభ్యుడిగా అవకాశం లభిస్తే.. తాజాగా ఆయన కొడుక్కి అదిత్ దేశాయ్ కు చోటు దక్కటం గమనార్హం.
ఇలా.. జగన్ ప్రభుత్వంలోనూ.. తాజా కూటమి సర్కారులోనూ టీటీడీ బోర్డులో చోటు దక్కించుకున్నారు. మిగిలిన వారి విషయానికి వస్తే.. పలు రంగాలకు చెందిన వారికి టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం లభించింది. వారి వివరాల్లోకి వెళితే..
- ఎన్ ఆర్ ఐ విభాగం నుంచి జాస్తి సాంబశివరావు
- ఫార్మా రంగానికి సంబంధించి నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లా
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన క్రిష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం (ఎందుకిలా అంటే.. తమిళనాడుకు చెందిన క్రిష్ణమూర్తికి అమిత్ షా ఎలా దగ్గరితనం ఉందంటే.. ఆ లెక్క వేరేనని చెబుతారు. అమిత్ షా సతీమణి, క్రిష్ణమూర్తి సతీమణి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. దీంతో.. ఆయనకు మరోసారి అవకాశం లభించిందని చెబుతారు. అంతేకాకుండా క్రిష్ణమూర్తి మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు)
- ఆర్ఎన్ దర్శన్ (కాఫీ వ్యాపారి)
- కుప్పం పారిశ్రామికవేత్త శాంతరామ్
- చెన్నైకు చెందిన పి.రామ్మూర్తి (పెద్ద టెక్స్ టైల్స్ వ్యాపారవేత్త. సీఎం స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడైన తిరుప్పూరు బాలుకు సోదరుడు. వీరు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ కు దగ్గరి బంధువుగా తెలిసింది)
- నరేష్ కుమార్ (కర్ణాటక)
- ఆర్థిక నిపుణుడు సౌరబ్ హెచ్ బోరా