జగన్ శ్రీవారి దర్శనం వేళలో ఏం చేస్తామో చెప్పేసిన టీటీడీ
దీనిపై టీటీడీ తాజాగా స్పందించింది. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటామని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వును వాడిని వైనంపై కొద్ది రోజులుగా సాగుతున్న షాకింగ్ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ కు డిసైడ్ కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తిరుమల షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో వైసీపీ అధినేతగా తిరుమలకు వస్తున్న ఆయన.. స్వామివారి దర్శనం చేసుకోవటానికి వెళ్లే వేళలో.. అన్యమతస్తుల నుంచి తీసుకునే డిక్లరేషన్ తీసుకుంటారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
దీనిపై టీటీడీ తాజాగా స్పందించింది. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే.. జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెడితే కానీ ఆయన్ను దర్శనానికి అనుమతించరన్న విషయంపై క్లారిటీ వచ్చినట్లుగా చెప్పాలి. తిరుమల టూర్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం (శుక్రవారం) రేణిగుంట విమానాశ్రయానికి రానున్నారు.అక్కడి నుంచి ఆయన తిరుమలకు చేరుకుంటారు. శనివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు అన్యమతస్తులు ఎవరైనా వచ్చి.. శ్రీవారిని దర్శించుకోవటానికి ముందు 17వ కంపార్ట్ మెంట్ వద్ద డిక్లరేషన్ మీద సంతకం చేయించుకుంటారు. వీవీఐపీలు వస్తే మాత్రం టీటీడీ అధికారులే.. వారు బస చేసిన గెస్టు హౌస్ వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకోవటం ఎప్పటి నుంచే ఉన్నదే. అయితే.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు ఆయన్ను డిక్లరేషన్ ఫారాల మీద సంతకాలు చేయాలని అడిగే ధైర్యం టీటీడీలో ఎవరూ చేయలేదు.
ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన ఎమ్మెల్యేగా రానున్నారు. దీనికి తోడు లడ్డూ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన్ను గెస్టు హౌస్ వద్దే టీటీడీ అధికారులు కలిసి.. డిక్లరేషన్ ఫారాల మీద సంతకాలు చేయాలని అడుగుతారని చెబుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు.. ఆయన చేత డిక్లరేషన్ మీద సంతకం చేయించుకొన్న తర్వాతే దర్శనం చేసేందుకునేందుకు అనుమతించాలన్న చర్చ భారీగా జరిగినా.. అదేమీ సాగలేదు.
తాజాగా మాత్రం మారిన పరిస్థితులు.. అధికారంలోకూటమి సర్కారు ఉండటంతో టీటీడీ అధికారులు సైతం స్పష్టమైన వైఖరితో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జగన్ తిరుమలకు వెళ్లేటప్పుడు ఆయన్ను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆయన అలిపిరి వద్ద మాట్లాడుతూ.. తాను.. టీటీడీ ఛైర్మన్.. ఈవోలం తప్పు చేశామని హిందువులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు వెళ్లేందుకు అర్హత లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటనతో ఉద్రిక్త వాతావణం ఏర్పడింది. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంట నెలకొంది.
శుక్ర.. శనివారాల్లో జగన్ తిరుమల షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 27 (శుక్రవారం)
సాయంత్రం 4.50 గంటలకు: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాయంత్రం 5 గంటలకు: రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరటం
రాత్రి 7 గంటలకు: తిరుమలకు చేరుకోనున్న జగన్
రాత్రి తిరుమలలోనే బస
సెప్టెంబర్ 28 (శనివారం)
ఉదయం 10.30 గంటలకు: తిరుమల శ్రీవారి ఆలయానికి బయలుదేరటం
శ్రీవారిని దర్శనం చేసుకోవటం
ఉదయం 11.30 గంటలకు: శ్రీవారి ఆలయం నుంచి గెస్ట్ హౌస్‌కు
ఉదయం 11.50 గంటలకు: తిరుమల నుంచి రేణిగుంటకు
మధ్యాహ్నం 1.20 గంటలకు: రేణుగుంట విమానాశ్రయానికి
మధ్యాహ్నం 1.30 గంటలకు: రేణిగుంట నుంచి బెంగళూరుకు
బెంగళూరు చేరుకున్న తర్వాత తన ఇంటికి ప్రయాణం