తుమ్మల కొత్త రాజకీయ ప్రయాణం షురూ!
ఎట్టకేలకు బీఆర్‌ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎట్టకేలకు బీఆర్‌ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి దెబ్బ తగిలింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ఇటీవల కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తుమ్మలకు సీటు దక్కలేదు. తుమ్మల ఆశిస్తున్న పాలేరు నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ సీటు ఇచ్చారు.
దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తన అనుచరులు, అభిమానులతో భారీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆయన అభిమానులు వేలాది కార్లతో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే.
కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేవలం ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణలోని కమ్మ సామాజికవర్గాన్ని తుమ్మల ప్రభావం చేయగలరని అంటున్నారు.
గతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. 2009లో టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2016లో టీఆర్‌ఎస్ లో చేరి పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో తుమ్మల విజయం సాధించారు. మళ్లీ 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
గతంలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో తుమ్మల నాగేశ్వరరావు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 2015లో కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాకుండానే తుమ్మలను రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.
కాగా 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మలకు ఎలాంటి పదవులు లభించలేదు. బీఆర్‌ఎస్ లో ఆయనను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులోనూ తుమ్మల పేరు లేదు. దీంతో కొద్ది రోజుల క్రితం తుమ్మల తన అనుచరులతో ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాడు తాను వచ్చే ఎన్నికల్లో నిలబడతా అని తుమ్మల నాగేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తన శిరస్సు నరుక్కుంటాను తప్ప తన వల్ల తన అభిమానులు ఎవరూ తలదించుకోవద్దన్నారు.
ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును ఇటీవల కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బీఆర్‌ఎస్ కు తుమ్మల రాజీనామా ప్రకటించారు. ఇన్నాళ్లూ తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ లో చేరితే తుమ్మలకు పాలేరు అసెంబ్లీ సీటు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఖమ్మం సీటు అని కూడా టాక్ నడుస్తోంది. తుమ్మల ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారో మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.