నేను డాలర్.. నువ్వు 2000 నోటు: ఏంటిది అనుకుంటున్నారా? చదవండి!
తాజాగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, తాజా కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఇదే పంథా ఎంచుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీఎన్నికల్లో వ్యాఖ్యలు కోటలు దాటుతున్నాయి. నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదేసమయంలో సెంటిమెంట్ల పంట కూడా పండుతోంది. ఈ క్రమంలో నాయకులు ప్రజలను ఆకర్షించే డైలాగులు కూడా పేలుస్తున్నారు. తాజాగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, తాజా కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఇదే పంథా ఎంచుకున్నారు. తన ప్రత్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
''నువ్వు చెల్లని 2000 రూపాయల నోటు'' అంటూ పువ్వాడ అజయ్‌పై విరుచుకుపడ్డారు. అదేసమయంలో తనను తాను 'అమెరికా డాలర్' తో పోల్చుకున్నారు. డాలర్ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా చెల్లుతుందని.. అలాంటి వ్యక్తిని తానని ఆయన చెప్పుకొచ్చారు.
కానీ, 2000 నోటును భారత ప్రభుత్వమే రద్దు చేసిందని.. కాబట్టి నువ్వ రద్దు కాబడే నాయకుడివని.. ఈ ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా రావని తుమ్మల వ్యాఖ్యానించారు.
'ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలిసే సత్తా నాకుంది.. రేపు ఖమ్మంలోనూ గెలుస్తున్నా. నేను డాలర్ లాంటి వాడిని. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా చెల్లుతా.. నీవు రద్దు చేసిన రూ.2వేల నోటువి. ఖమ్మం దాటితే ఎక్కడా పోటీ చేయలేవు' అంటూ తుమ్మల.. పువ్వాడ అజయ్‌పై విరుచుకుపడ్డారు. ఖమ్మం దాటి పక్కకు వెళితే అజయ్‌ను ఎవరూ గుర్తు కూడా పట్టలేరని వ్యాఖ్యానించారు.
తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరినీ బెదిరించలేదని, కుల, మత సంఘాల్లో విద్వేషాలు సృష్టించలేదని తుమ్మల పేర్కొన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా, గెలిచినా ఖమ్మం నగరం అభివృద్ధిని మరవలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోసం చేసిన ఘనుడని అజయ్‌పై విమర్శలు గుప్పించారు.