ఢిల్లీలో డ్రగ్స్ కలకలం... రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం!

దేశ రాజధానిలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద దాడిగా చెబుతున్న దక్షిణ ఢిల్లీలో జరిగిన దాడిలో ఢిల్లీ పోలీసులు సుమారు 500 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-02 11:15 GMT

ప్రస్తుతం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనది డ్రగ్స్ అని అంటున్నారు. ఈ మాదకద్రవ్యాల వ్యవహారం ఇప్పుడు భారత్ కు పెను సవాళ్లు విసురుతుంది. పోలీసులు దాడులు చేసే కొద్దీ ఈ డ్రగ్స్ దందా వ్యవహారాలు వెలుగు చుస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో దేశ రాజధానిలో కొకైన్ బస్తాలు బయటపడ్డాయి!


అవును... దేశ రాజధానిలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద దాడిగా చెబుతున్న దక్షిణ ఢిల్లీలో జరిగిన దాడిలో ఢిల్లీ పోలీసులు సుమారు 500 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశ రాజధానిలో పట్టుబడటంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ దాడిలో పట్టుబడిన ఈ 500 కేజీల కొకైన్ విలువ రూ.2,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సౌత్ ఢిల్లీలో సోదాలు జరిపిన పోలీసులు ఈ భారీ డ్రగ్స్ రాకెట్ ను ఛేధించారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరు ఆఫ్గన్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోనూ 1,660 గ్రాముల కొకైన్ పట్టుబడింది.

పెడరల్ రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా జాతీయుడు అయిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. ఆ సమయంలో ఆ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.24 కోట్ల విలువైన 1,660 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఎన్.డీ.పీ.ఎస్. చట్టం 1985 కింద కేసు నమోదు చేశారు! ఇప్పుడు ఏకంగా 500 కేజీల కొకైన్ దొరకడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News