శాంతి దూత మోదీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంధి కుదిర్చితే నోబెల్ ప్రైజ్?
ఉక్రెయిన్.. అమెరికా సారథ్యంలోని నాటో కూటమిలో చేరే ప్రయత్నంతో రష్యా యుద్దానికి దిగింది.
ప్రపంచమంతా యుద్దాలతో మునిగిపోయిన దశలో శాంతి వచనాలు పలికితే ఆ ప్రయత్నాన్ని మెచ్చనివారు ఎవరుంటారు? మిగతా దేశాలన్నీ విఫలమైన చోటనే ఓ దేశాధినేత తనవంతు ప్రయత్నంతో శాంతి నెలకొల్పితే దానిని ఎవరు కాదంటారు..? ఇప్పుడిదే పని చేస్తున్నారు భారత ప్రధాని మోదీ. రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మోదీ తప్ప ఇతర దేశాలకు చెందినవారు ఎవరూ శాంతి మాట ఎత్తలేకపోయారు. అందుకే.. మోదీ శాంతి దూతలా కనిపిస్తున్నారు.
అందరూ దూరమే.. మోదీనే దగ్గర
ఉక్రెయిన్.. అమెరికా సారథ్యంలోని నాటో కూటమిలో చేరే ప్రయత్నంతో రష్యా యుద్దానికి దిగింది. దీంతో సహజంగానే నాటో కూటమిలోని దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితరాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు సాయం చేయడం మొదలుపెట్టాయి. ఆయుధాలు, మందుగుండు సహా అనేక విధాలుగా సాయం చేస్తూ యుద్ధాన్ని పరోక్షంగా ఎగదోస్తున్నాయి. మధ్యలో తుర్కియే వంటి దేశాలు సంధి ప్రయత్నాలు మొదలుపెట్టినా అవి ముందుకుసాగలేదు. ఒక్క భారత్ మాత్రమే మొదటినుంచి శాంతి శాంతి అని ఉద్బోధిస్తోంది.
చర్చలు, సంప్రదింపులే మార్గం
రష్యాతో భారత్ బంధం దశాబ్దాలుగా పటిష్ఠమైనది. ఓ దశలో అమెరికా పాకిస్థాన్ కు సాయంగా భారత్ పై యుద్ధానికి వస్తే రష్యానే అడ్డుకుంది. అయితే, ఇప్పటి పరిస్థితులు మారాయి. ఇక ఉక్రెయిన్ తో మనకు అంత బలమైన సంబంధాలు లేకపోయినా.. భారతీయ విద్యార్థులు వేలాదిమంది అక్కడ చదువుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ మొదటినుంచి ఉక్రెయిన్-రష్యాలకు సర్దిచెబుతూనే ఉంది. సంప్రదింపులు, చర్చల ద్వారానే సంక్షోభాలకు పరిష్కారం అని సూచిస్తోంది. ఐక్యరాజ్య సమితిలోనూ ఈ సమస్యపై కీలకమైన ఓటింగ్ సందర్భంగా తన వైఖరిని స్పష్టంగా చెప్పింది.
ఇరు దేశాల్లో పర్యటించింది మోదీనే..
ఉక్రెయిన్ –రష్యా యుద్ధం మొదలయ్యాక ఆ రెండు దేశాలను సందర్శించిన దేశాధినేత ఎవరైనా ఉన్నారా అంటే అది మోదీనే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సహా రష్యాకు దగ్గరగా ఉండే ఏ దేశాధినేత కూడా ఉక్రెయిన్ కు వెళ్లలేదు. మోదీ మాత్రం ఆ పనిచేశారు. ఇక తాజాగా ఉక్రెయిన్ పర్యటనలో మోదీ మరింత చొరవ చూపారు. రెండు దేశాల చర్చలకు తాను స్నేహితుడిగా సాయం చేస్తానని ప్రకటించారు. యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని సూచించారు. గత ఏడాది, ఇటీవల కలిసిన సందర్భంలోనూ పుతిన్ కు యుద్ధం వద్దనే చెప్పారు. మధ్యవర్తిత్వం వహించేందుకూ సిద్ధంగా కనిపించారు. మరిప్పుడు ఉక్రెయిన్ తిరుగుబాటు తీవ్రంగా ఉన్న వేళ మోదీ సూచన ఎంతవరకు చెల్లుతుందో చూడాలి. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య ఆయన యుద్ధాన్ని ఇక్కడితో ఆపగలిగితే పెద్ద విజయం సాధించినట్లే. మద్దతుదారులు పొగుడుతున్నట్లుగా ‘ప్రపంచ నాయకుడు’ అనే మాటకు న్యాయం చేసినట్లే. అంతేకాదు.. ఏకంగా ప్రతిష్ఠాత్మక ‘నోబెల్ శాంతి బహుమతి’కి ఎంపికైనా ఆశ్చర్యం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరొక్క ప్రాణమూ పోకుండా, పైసా ఆస్తి నష్టం లేకుండా అదే జరగాలని ఆశిద్దాం.