గుర్తు చేసి గుబులు తీర్చారు.. 'కూటమి' చెప్పుకోవచ్చు.. !
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ఏం కేటాయించారన్నది నిర్వివాదాంశం.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ఏం కేటాయించారన్నది నిర్వివాదాంశం. కానీ, ఈ విషయంలో కూటమిని కేంద్రం గట్టెక్కించిందనే చెప్పాలి. తాము ఇవ్వకపోయినా.. ఇచ్చిన విషయాలను పార్లమెంటు వేదికగా ప్రస్తావించి.. కూటమి మిత్రులు చెప్పుకొనేందుకు మార్గం క్లియర్ చేశారు. ఇది ఏపీలో కూటమి నేతలకు కొంత ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. ఇదే సమయంలో అనుకూల మీడియాలోనూ రాసుకునేందుకు అవకాశం కల్పించింది.
వాస్తవానికి ప్రస్తుత బడ్జెట్ తీరును గమనిస్తే.. దేశాన్ని కేంద్రంగా చేసుకుని అడుగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ.. కేంద్రంలోని కూటమి సర్కారుకు ఏపీలో టీడీపీ, జనసేనలు బలమైన మద్దతు దారులుగా ఉన్న నేపథ్యంలో ఏదో ఇస్తారని ఆశించడం తప్పుకాదు. పైగా చంద్రబాబు దావోస్ పర్యటనను మధ్యలోనే ముగించి.. ఢిల్లీలో వాలిపోయి.. బడ్జెట్ కు వారం ముందే.. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి.. విన్నపాలు వినవలె.. అంటూ రాష్ట్ర పరిస్థితిని వివరించిన దరిమిలా ఏదో వచ్చేస్తుందన్న ఆశ సహజం.
కానీ, ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌లో ఆ దిశగా అడుగులు పడకపోయినా.. గతాన్ని గుర్తు చేశారు. అమరావతికి 15000 కోట్లు ఇచ్చిన విషయాన్ని, పోలవరం ఎత్తు, ఆర్థిక సాయం.. వెనుక బడిన జిల్లాలకు నిధులు, పన్నుల్లో వాటా వంటివి పార్లమెంటు వేదికగా ప్రస్తావించి.. కూటమి చెప్పుకొనేందుకు కొంత ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. వీటితోపాటు.. కొత్తగా పోలవరానికి 5 వేల కోట్లకు పైగానే ఇస్తున్నట్టు చెప్పారు. అదేవి ధంగా విశాఖ స్టీలు ప్లాంటు, పోర్టులకు కూడా తాజా బడ్జెట్‌లో కేటాయింపులు ఇచ్చారు.
ఒక రకంగా.. కూటమి నేతలకు ఇది ఆక్సిజనే అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణతో పోల్చుకున్నప్పు డు.. ఏపీ గురించిన ప్రస్తావన ఉండడం.. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కవి గురజాడ అప్పారావు ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏపీని తాము మరిచిపోలేదన్న భావనను కూడా మోడీ కల్పించారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. గతాన్ని గుర్తు చేసి.. కూటమికి స్కోప్ పెంచారన్న వాదన అయితే వినిపిస్తోంది. అసలుఏపీ గురించి పన్నెత్తు మాట మాట్లాడకపోతే.. అప్పుడు వివాదం అయ్యేది. కాబట్టి.. ఇది ఆశించిన విధంగా లేకున్నా.. ఆశలు నెరవేర్చేది ఉందన్నది వాస్తవం.