జగన్ అప్పుడలా...ఇపుడిలా...ఎంత తేడా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఈ కోణాన్ని పార్టీ నేతలు క్యాడర్ ఎపుడూ చూడలేదు అని అంటున్నారు.

Update: 2025-02-02 20:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఈ కోణాన్ని పార్టీ నేతలు క్యాడర్ ఎపుడూ చూడలేదు అని అంటున్నారు. ఆయన ఎపుడూ దూకుడు రాజకీయమే చేస్తారు. ప్రతికూలతను ఆయన ఎదురీదుతూ ముందుకు సాగుతారు. ఆయన కోరి వాటిని తెచ్చుకుంటారా లేక సవాళ్ళను అందిపుచ్చుకోవడం ఆయన మార్క్ రాజకీయ అలవాటుగా ఉందా అని అంతా చర్చించుకునే పరిస్థితి ఒకనాడు ఉండేది.

ఇదంతా ఎందుకు అంటే 2009లో తన తండ్రి ఉమ్మడి ఏపీలో దిగ్గజ నేత వైఎస్సార్ మరణించాక జగన్ కాంగ్రెస్ ని వీడి అతి పెద్ద కష్టాలలో పడ్డారని అంతా విశ్లెషించారు. మరొకరు ఎవరైనా కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పదవులు మెల్లగా పొందే వారు అని అంటారు.

కానీ జగన్ తన దూకుడు బాటనే ఎంచుకున్నారు. ఆయనను పదహారు నెలల పాటు జైలులో ఉంచినా కూడా ఆయన ఏ మాత్రం చింతించలేదు. పశ్చాత్తాపం కూడా పడలేదు. ఇక 2014లో అధికారం దాదాపుగా ఖాయం అని అంతా అనుకున్న వేళ దగ్గర దాకా వచ్చి పవర్ చేజారిగా ఆయన ఎక్కడా నిరాశ చెందలేదు.

ఆ రోజున ఫలితాలు అన్నీ టీడీపీకి అనుకూలంగా వస్తున్న వేళ జగన్ మీడియా ముందుకు డేరింగ్ గా వచ్చి దెబ్బ కొట్టారు తీసుకుంటాం, మా చాన్స్ వచ్చినపుడి తిరిగి ఇంకా బలంగా కొడతామని చాలా పాజిటివ్ గా చెప్పుకొచ్చారు. ఆ తీరుగాన ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రజా క్షేత్రంలో అయిదేళ్ళ పాటు పోరాడారు.

అప్పటికి ఆయన రాజకీయ అనుభవం కేవలం అయిదేళ్ళు మాత్రమే. కానీ 2019లో అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా కూడా చేసి ఓడాక మాత్రం జగన్ లో ఆ తరహా దూకుడు రాజకీయం ఎక్కడా కనిపించడం లేదు అని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ ఓడి ఈ నెల 4తో ఎనిమిది నెలలు నిండిపోతున్నాయి.

జగన్ ఈ ఎనిమిది నెలల కాలంలో జనంలోకి వచ్చినది పెద్దగా లేదు అని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీకి వెళ్ళలేదు. మీడియాతో అపుడపుడు ఇంటరాక్ట్ కావడం తప్ప ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదని అంటున్నారు. ఆయన ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ లో గడుపుతున్నారు అన్న ప్రచారం సాగింది. ఇక లండన్ లో అయితే ఆయన ఈసారి టూర్ లో ఎక్కువ సమయం గడిపారు అని అంటున్నారు.

ఒక వైపు పార్టీకి పిల్లర్స్ గా ఉన్న నాయకులు అంతా వీడిపోతున్నారు. ఉన్న వారు డీ మోరలైజ్ అవుతున్నారు. వారికి ధైర్యం చెప్పి నైతికంగా భరోసా ఇవ్వాల్సిన వేళ జగన్ తన వంతు పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. పోయిన వారు పోనీయండి అన్న వైఖరితో అధినాయకత్వం ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎనిమిది నెలలలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు, పాలన బాగా లేదు, ప్రజలలో వ్యతిరేకత పెరిగింది అని ఒక వైపు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ విపక్ష పాత్రలో వైసీపీ కూడా పాస్ మార్కులను సాధించలేకపోతోంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఇపుడిపుడే ప్రజలు ఒక క్లారిటీకి వస్తున్నారు.

ఈ నేపధ్యంలో మారుతున్న రాజకీయాన్ని అందిపుచ్చుకునేందుకు వైసీపీ నుంచి సరైన ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ కూడా ఉంది. వైసీపీ అంటేనే ఏక శిలా సదృశ్యంగా చెప్పాలని అంటున్నారు. జగన్ తోనే ఆ పార్టీ జగన్ తోనే అంతా అన్నట్లుగా ఉంటుంది. జగన్ జనంలోకి వస్తేనే క్యాడర్ కి అయినా లీడర్ కి అయినా ధైర్యం వస్తుంది అని అంటున్నారు.

జగన్ ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే అంతలా పార్టీ ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు పార్టీ తరఫున ఆందోళనలు నిర్వహించడం వరకూ ఓకే కానీ వాటి వల్ల పెద్దగా మైలేజ్ రాదని అంటున్నారు. అదే జగన్ జనంలోకి వెళ్తే ఆ ఇంపాక్టు వేరేగా ఉంటుందని అంటున్నారు.

ఇంతకీ జగన్ జనంలోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏమిటి అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఆయన కూటమి ప్రభుత్వానికి మరింత కాలం సమయం ఇద్దామని చూస్తున్నారా అన్నది కూడా ఉంది. అంతే కాదు ఇది వ్యూహాత్మకంగా అని కూడా చర్చిస్తున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా జనవరి మూడవ వారం నుంచి జనంలో ఉంటాను అని చెప్పిన జగన్ లండన్ టూర్ పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో అయినా జనంలోకి వస్తారా అన్న చర్చ అయితే పార్టీలోపాలా బయటా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News