మూడో రోజు విచారణ : వంశీ సంచలన ఆరోపణలు

కేసుతో సంబంధం లేని ప్రశ్నలు వేయడంతోపాటు ఈ కేసులో తాను అమాయకుడినని వంశీ చెప్పుకున్నారని అంటున్నారు.

Update: 2025-02-27 14:23 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. విచారణలో భాగంగా మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు సాయంత్రం జిల్లా జైలుకు తరలించారు. మూడో రోజు ముగిసిన అనంతరం వంశీని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ముందు వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేశారని చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని ప్రశ్నలు వేయడంతోపాటు ఈ కేసులో తాను అమాయకుడినని వంశీ చెప్పుకున్నారని అంటున్నారు.

వల్లభనేని వంశీ మూడో రోజు కస్టడీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయనను విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. మూడు రోజుల కస్టడీ ఎలా జరిగిందని న్యాయాధికారి ప్రశ్నించగా, పోలీసులపై వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కిడ్నాప్ కేసులో బాధితుడిగా చెబుతున్న సత్యవర్థన్ కు నార్కో అనాలిసిస్ టెస్టు నిర్వహిస్తే అసలు నిజం ఏంటో తెలుస్తుందని న్యాయమూర్తితో వంశీ చెప్పుకున్నారని అంటున్నారు. మరోవైపు తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, తనను ఒక్కడినే జైలు గదిలో ఉంచుతుండటం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వంశీ నివేదించారు. అయితే అటెండర్ ఇవ్వాలని తాను ఆదేశాలు ఇవ్వలేనని, రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని న్యాయాధికారి వంశీకి సూచించినట్లు చెబుతున్నారు. రెగ్యులర్ న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో వంశీని ఇన్ చార్జి న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు.

ఇక వంశీ ఆరోపణలపై స్పందించిన పోలీసులు.. భద్రతా కారణాల వల్లే వంశీని ఒంటరిగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వంశీకి అటెండర్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని న్యాయాధికారి సూచించారు. అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ఇక వంశీని జైలుకు తరలించిన అనంతరం ఆయన భార్య పంకజశ్రీ,, న్యాయవాది చిరంజీవులు మీడియాతో మాట్లాడారు. సత్యవర్థన్ అబద్ధాలు చెబుతున్నాడని, వంశీ నిర్దోషిగా బయటకు వస్తారని చెబుతున్నారు. వంశీని జైలులో ఉంచేందుకే అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వంశీపై ఎన్నికేసులు నమోదు చేస్తున్నారో తెలియడం లేదని, అన్ని కేసుల వివరాలను తెలుసుకుని బెయిల్ పిటిషన్లను ఒకేసారి దాఖలు చేస్తామని న్యాయవాది తెలిపారు.

మరోవైపు వంశీ మూడు రోజుల కస్టడీలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని విచారణాధికారి ఏసీపీ దామోదర్ తెలిపారు. కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మిగతా నిందితులను కస్టడీకి కోరనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ నెల 12న మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసినట్లు వంశీ అంగీకరించినట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, ఇదే కేసులో నిందితులైన డ్రైవర్ వంశీబాబు, వీర్రాజులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News