వందే భారత్ మెట్రోలో నో రిజర్వేషన్.. మొదటి రైలు ఆ రూట్ లోనే!

కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరితే.. రైల్వేల స్వరూపాన్ని మార్చేస్తారని.. చౌకగా ఉండే రైలు ప్రయాణాన్ని అలానే కొనసాగిస్తూ

Update: 2024-09-15 07:30 GMT

కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరితే.. రైల్వేల స్వరూపాన్ని మార్చేస్తారని.. చౌకగా ఉండే రైలు ప్రయాణాన్ని అలానే కొనసాగిస్తూ.. దానికి కొత్త లుక్ ఇచ్చేయటం ఖాయమన్న నమ్మకం బలంగా ఉండేది. అయితే.. మోడీ మాష్టారు కొలువు తీరిన తర్వాత ఆ ఆశలు ఆడియాశలు కావటమే కాదు.. రైల్వేలకు సంబంధించిన తీసుకున్న పరిణామాలు చూస్తే.. దశాబ్దాల తరబడి సాగుతున్న పెద్ద వయస్కులకు ఇచ్చే రాయితీలకు మంగళం పాడటం దగ్గర నుంచి.. సామాన్యులకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లకు కోత పెట్టటం వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఇవేమీ.. సగటు జీవి జేబుకు మేలు చేసేవి కాకపోవటమే అసలైన విషాదం.

అయితే.. మోడీ హయాంలో వందే భారత్ పేరుతో ఒక కొత్త సిరీస్ రైళ్లను తెర మీదకు తీసుకొచ్చారు. వందే భారత్.. వందేభారత్ స్లీపర్.. వందే భారత్ మెట్రో రైళ్ల పేరుతో కొత్త ప్యాట్రన్ ను తెర మీదకు తీసుకొచ్చారు. పరిమిత స్టాపులతో వేగంగా వేళ్లేలా వీటిని డిజైన్ చేసినా.. టికెట్ ధరలు జేబులకు చిల్లులు పడేలా ప్లాన్ చేశారు. అప్పటివరకు ఇండియన్ రైల్వేలు.. అందరికి అందుబాటులో ఉండేలా అన్న దానిని మార్చేసి.. కొందరికి మాత్రమే పరిమితం అయ్యేలా ప్లాన్ చేసిన ఘనత మోడీ సర్కారుకే దక్కుతుంది.

వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకెళతాయన్న మాటతో పాటు.. అత్యాధునిక కోచ్ లతో పాటు. .ఇప్పటివరకు నడుస్తున్న రైళ్లకు భిన్నంగా చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేయటం దీని ప్రత్యేకత. వందే భారత్ రైళ్ల గురించి తెలిసిందే. తాజాగా వందే భారత్ మెట్రోను పట్టాల మీదకు తీసుకొస్తున్నారు. దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును అందరి అంచనాలకు తగ్గట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కే కేటాయించారు.

అహ్మదాబాద్ - భుజ్ మధ్య తిరిగే ఈ వందే బారత్ మెట్రో ప్రత్యేకత ఏమంటే.. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. రైలు ప్రారంభానికి ముందు టికెట్లను జారీ చేస్తారు. కాకుంటే.. బోగీలు మొత్తం ఏసీనే. టికెట్ కౌంటర్లలో టికెట్లు తీసుకుంటే సరి. ఈ ట్రైన్ లో మొత్తంగా కూర్చోవటానికి 1150 మందికి వీలు ఉంటే.. 2వేలకు పైనే నిలుచోవటానికి వీలుంది. గంటకు 110 కిలోమీటరల వేగంతో దూసుకెళ్లటం ఈ ట్రైన్ ప్రత్యేకత. అయితే.. టికెట్ ధరలు ఏ రేంజ్ లో ఉంటాయన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. మొత్తంగా పట్టాలకు మీదకు ఎక్కనున్న వందే భారత్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల మీదనే ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News