జగన్ కి ఇదే అగ్ని పరీక్ష!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన రాజకీయ జీవితంలో ఇపుడు అతి పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన రాజకీయ జీవితంలో ఇపుడు అతి పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. జగన్ రాజకీయాల్లోకి తండ్రి వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు వచ్చినా యన మరణం తరువాత రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అయితే జగన్ వెనకాల వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు శ్రీరామరక్షగా నిలిచి తొలినాళ్ళలో కాపాడాయి. ఆ తరువాత జగన్ దూకుడు రాజకీయంతో మరింత ముందుకు సాగారు.
అయితే ఇపుడు దారుణంగా పార్టీ ఓటమి పాలు అయిన తరువాత తిరిగి దానిని పునరుజ్జీవం చేయడం అన్నది వైసీపీ అధినేతకు కత్తి మీద సాము లాంటిది అని అంటున్నారు. ఏ పార్టీకి అయినా నాయకులు ఉండొచ్చు పార్టీలు మారవచ్చు. ఇది అధికారంలో ఉన్న పార్టీలు విపక్షంలోకి వచ్చినపుడు జరిగేదే.
అయితే నాయకులు ఎంత మంది పోయినా పార్టీలు పదిలంగా ఉండాలీ అంటే క్యాడర్ చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే టీడీపీ నాలుగు దశాబ్దాలుగా నిలదొక్కుకుంది అంటే క్యాడర్ బేసెడ్ పార్టీగానే చూడాలి. తమిళనాడులో కూడా డీఎంకే వరసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలు అయి పద్నాలుగేళ్ళ పాటు విపక్షంలో ఉన్నా కూడా క్యాడర్ బలంగా పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది.
వైసీపీ విషయానికి వస్తే క్యాడర్ బలంగానే ఒకనాడు పనిచేసింది. వారిని వ్యవస్థీకృతం చేఅసుకుని పార్టీని స్ట్రాంగ్ గా చేసుకునే విధానం అయితే వైసీపీ ఆది నుంచి పాటించలేదు. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఇదే తీరుగా పోయింది. అయితే వైసీపీ అధికారం రుచి చూసింది. ఆ సమయంలో క్యాడర్ కి మేలు జరుగుతుందని ఆశించి పదేళ్ళ పాటు క్యాడర్ కష్టించి పనిచేసింది.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది. ఆ తరువాత క్యాడర్ ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో అయిదేళ్ళ వైసీపీ పాలన చూసిన క్యాడర్ దూరం జరగడం మొదలెట్టారు. అదే 2024 ఎన్నికల్లో కొంప ముంచింది. అయితే ఇపుడు వైసీపీ భారీ ఓటమికి కారణం క్యాడర్ లో పూర్తి స్థాయిలో నిస్తేజం అని అంటున్నారు.
నాయకులు అయితే వరసబెట్టి పార్టీని వీడిపోతున్నారు. కానీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. కానీ క్యాడర్ విషయం అలా కాదు వారిని దగ్గర చేసుకోవాల్సి ఉంది. వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సి ఉంది. ఆ దిశగా వైసీపీ హైకమాండ్ కసరత్తుని అయితే ప్రారంభిస్తోంది. జగన్ కొత్త ఏడాది జనంలోకి రావడం కూడా పూర్తిగా క్యాడర్ లో పూర్తి ఉత్సాహం తీసుకుని రావడమే అంటున్నారు.
ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలను ఒక్కసారి గమనించాలి. పార్టీ క్యాడర్ కి అన్యాయం చేసింది అని ఆయన ఒప్పుకున్నారు. వారిలో అసంతృప్తి ఉండడం సహజం అని తాము అంతా దానికి బాధ్యులమే అన్నారు. ఇక మీదట అలా జరగదు అని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని అపుడు క్యాడర్ కే మేలు చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు.
విజయసాయిరెడ్డి విశాఖలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ వేళ ఈ కామెంట్స్ చేశారు. ఆయన ప్రసంగంలో ఈ మాటలకే క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు పడ్డాయి. అయితే నాలుగున్నరేళ్ళ పాటు క్యాడర్ పార్టీని భుజాన వేసుకుని నడిపించాలి. ఆ మీదటనే అధికారం దక్కుతుంది. మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే క్యాడర్ ని పట్టించుకుంటారా అని ఈ రోజుకీ సగటు కార్యకర్తలో అనుమానాలు సవాలక్ష ఉన్నాయి.
వాటిని తీర్చడమే అధినేత జగన్ కి అగ్ని పరీక్ష అని అంటున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకీ రాని ఇబ్బంది వైసీపీకి వచ్చింది. క్యాడర్ విశ్వాసం తీసుకోవడమే ఆ పార్టీకి పెను సవాల్ గా మారుతోంది. ఇక్కడే జగన్ దీక్ష దక్షతలు ఆయన నాయక్త్వ పటిమ ఆధారపడి ఉంటాయని అంటున్నారు. క్యాడర్ ని కనుక జోరెత్తించి పరుగులు తీయించగలిగితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.