చంద్రబాబుపై విజయసాయిరెడ్డికి పెద్ద ప్లాన్సే ఉన్నాయా..?
తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్, లోఫర్, బ్రోకర్ అంటూ రెచ్చిపోయారు! సీఎం చంద్రబాబు, కేవీ రావు, నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలవ్వడం తథ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బియ్యం అక్రమ రవాణా, సీజ్ ది షిప్ దగ్గర మొదలైన వ్యవహరం ఇప్పుడు కాకినాడ పోర్టులో బెదిరించి షేర్లు తక్కువ రేటుకు రాయించుకున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.
ఇందులో భాగంగా... కాకినాడ పోర్టు యాజమాన్యాన్ని తమ బంధువులకు ఇప్పించుకునేందుకు విజయసాయిరెడ్డి తనను బెదిరించి షేర్లు తక్కువ రేట్లకు లాక్కున్నారంటూ మాజీ ఛైర్మన్ కేవీ రావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ సాయిరెడ్డిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా అసలు ప్రభుత్వ రంగంలోని పోర్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎళా వెళ్లింది అంటూ.. పుట్టుపూర్వత్రాలు బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేటు పరం చేశారని.. మలేషియా ప్రధాని మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారంటూ అప్పట్లో చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు.
చివరికి ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారన్నారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ పై కక్ష తీర్చుకోవాలనే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే... స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 58 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారని.. ఆయన ఓ క్రిమినల్ అంటూ సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజంగా అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్లుగా కేవీ రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు చెంచా అని.. సింగపూర్ లో ఉండి ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేసే వ్యక్తి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో నాలుగున్నరేళ్లు చంద్రబాబు అధికారంల్మో ఉంటాడని.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలవ్వడం తథ్యమని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకి పాలన చేతకాదని.. లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదని.. పనికి రాని మంత్రి అని.. తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అసలు తనకు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయ్యే స్థాయిలో ఓటమి పాలవ్వడానికి గల కారణాల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఒకటనే చర్చ బలంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వయసులో చంద్రబాబుని సెంట్రల్ జైలుకి పంపడం వైసీపీ సర్కార్ చేసుకున్న రాజకీయ ఆత్మహత్యా ప్రయత్నం అనే విశ్లేషణలూ తెరపైకి వచ్చాయి.
అయితే... తాము మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం కన్ ఫాం అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే... గత ఎన్నికల్లో 11 ఎందుకు వచ్చాయో సాయిరెడ్డికి క్లారిటీ లేదా? అనే ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి!