విశాఖ రైల్వే స్టేషన్ లో కుంగిన బ్రిడ్జ్!

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే విశాఖ రైల్వే స్టేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది;

Update: 2024-04-09 07:22 GMT

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే విశాఖ రైల్వే స్టేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ లో 3, 4 ప్లాట్ పాం మీదకు వెళ్లేందుకు వీలుగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పాదచారుల వంతెన (బ్రిడ్జి) హటాత్తుగా కుంగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గేటు నెంబరు 3కు అనుసంధానం అయ్యే ఈ బ్రిడ్జి హటాత్తుగా కుంగటంతో దానిపై నడుస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

ఆ సమయంలోనే బ్రిడ్జి కింద అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్దంగా ఉంది. లక్కీగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కుంగిన బ్రిడ్జి ఏ మాత్రం మరింత కిందకు జారినా.. కుప్పకూలినా పరిస్థితి మహా దారుణంగా ఉండేదన్న మాట వినిపిస్తోంది. అప్పటివరకు బాగానే ఉన్నా బ్రిడ్జి హటాత్తుగా కుంగటంతో ప్రయాణికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

బ్రిడ్జి మధ్యలో వంగింది.అయితే.. బ్రిడ్జి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన ఇనుము తుప్పు పట్టటం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. ఈ పరిణామానికి స్పందించిన రైల్వే సిబ్బంది 3-4 ప్లాట్ ఫాంకు వచ్చే రైళ్లను నిలిపివేశారు. బ్రిడ్జి కుంగిన సమయంలో కరెంట్ వైర్లు తెగి పడ్డాయి. అయితే అప్పటికి అక్కడ ఎలాంటి ట్రైన్లు లేవు.

ధన్ బాద్ - అలెప్పీ బొకారో రైలు స్టేషన్ లోకి వస్తోంది. దీన్ని వెంటనే ఆపుచేశారు. దాదాపు గంటన్నర పాటు అలానే ఉంచేసిన ఆ రైలును వెనుక నుంచి మరో ఇంజిన్ ను తగిలించి.. ఐదో నెంబరు ఫ్లాట్ ఫాం మీదకు తరలించారు. మొత్తంగా పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా చెబుతున్నారు. వంతెన లోపల భాగంగా తుప్పు పట్టిందని.. రిపేర్లు చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News