బాబు చెబితే.. పవన్‌కు వైసీపీ మద్దతు!
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.
విశాఖలో సాగుతున్న మూడో విడత వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సాగుతున్నారు. రుషికొండ పర్యటనతో అందరి దృష్టి ఆ కొండపైకి మళ్లేలా చేశారు.
పవన్‌ను ఇలా వదిలేస్తే లాభం లేదని భావించిన వైసీపీ నేతలు.. మరోసారి ఎదురు దాడికి దిగుతున్నారు. బాబు పేరు చెప్పి పవన్ నోరు మూయించాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.
ఏపీకి సీఎం కావాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పొత్తులకూ వెనుకాడడం లేదు. కానీ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన.. టీడీపీ విషయంలో మాత్రం ఓ నిర్ణయం తీసుకోవడం లేదు.
ఇదే విషయాన్ని ఉద్దేశించి ఎంపీ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ తమ సీఎం అభ్యర్థి అని చంద్రబాబుతో చెప్పిస్తే.. వైసీపీ కూడా పవన్‌కు మద్దతుగా నిలుస్తుందని ఎంపీ అనడం గమనార్హం. అదెలాగో జరిగే పని కాదనే తెలిసే.. పవన్‌ను ఇరకాటంలో పెట్టేందుకే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఎంపీ నిలదీశారు. పవన్ కన్నా కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటరని ఎద్దేవా చేశారు. పవన్ దమ్ముంటే మరోసారి గాజువాకలో పోటీచేయాలని, లేకపోతే తనపై పోటీకి దిగాలని ఎంపీ సత్యనారాయణ సవాలు విసిరారు.
బ్రో సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని ఆయన అన్నారు. పార్టీని పవన్ తాకట్టు పెట్టారని, సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు.