రైల్వే జోన్ ఇచ్చినా బీజేపీకి సుఖం లేదుగా !

అదేంటో కేంద్రంలోని బీజేపీ విశాఖకు ఇటీవల కాలంలో కొన్ని వరాలు ప్రకటించినా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం లేదు సరికదా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.

Update: 2025-02-11 03:41 GMT

అదేంటో కేంద్రంలోని బీజేపీ విశాఖకు ఇటీవల కాలంలో కొన్ని వరాలు ప్రకటించినా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం లేదు సరికదా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎన్నడూ లేని విధంగా ఇంకా చెప్పాలీ అంటే చాలా ఏళ్ళ తరువాత ఒక భారీ ఆర్ధిక ప్యాకేజి దక్కింది. ఏకంగా 11 వేల 400 కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజిని కేంద్రం ప్రకటించినా విశాఖలోని ప్రజా సంఘాలు వామపక్షాలు ఉద్యమ కారులు ఎవరూ సంతోషంగా లేరు.

విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సొంత గనులు కేటాయించాలని కూడా కోరుతున్నారు. సెయిల్ లో విలీనం చేయాలని పట్టుబడుతున్నారు. దాంతో ఇంతటి భారీ ప్యాకేజి ఇచ్చినా మైలేజ్ అయితే రావడం లేదు అన్నది ఒక చర్చగా ఉంది.

ఇక చూస్తే విశాఖకు రైల్వే జోన్ ని కేంద్రం ప్రకటించింది. ఇది ఒక అర్ధ శతాబ్దం కలగా ఉంది. ఎపుడో 1970 ప్రాంతంలో విశాఖ నుంచి లోక్ సభకు ఎంపీగా వ్యవహరించిన దివంగత తెన్నేటి విశ్వనాధం విశాఖ రైల్వే జోన్ డిమాండ్ ని తొలిసారి పార్లమెంట్ లో వినిపించారు. అది అలా మొదలైన ఉద్యమంగా సాగినా కూడా సాకారం కాలేదు. విభజన తరువాత ఎట్టకేలకు పదకొండేళ్ళకు విశాఖకు జోని మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అంతే కాదు వాల్తేరు డివిజన్ ని విశాఖ డివిజన్ గా మార్చింది. అయితే విశాఖ డివిజన్ లో ఉండే రైల్వే లైన్ల మీద ఇపుడు విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు అన్నీ కొత్త చిచ్చుని రాజేస్తున్నాయి. కకే రైల్వే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి.

ఏటా పదివేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొత్తవలస కిరండోల్ రైల్వే లైన్ ని ఒడిశాలోని రాయగడ డివిజన్ కి కేటాయించటం పట్ల వైసీపీ సహా అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద అరకు ఎంపీ కేంద్ర రైల్వే శాఖకు లేఖ కూడా రాశారు. కేకే లైన్ లోనే అరకు ఉందని పర్యాటక క్షేత్రంగా ఉన్న అరకు వల్ల ఆదాయం ఎక్కువగా వస్తునదని అంతటి లాభసాటి రైల్వే లైన్ ని తీసేస్తే విశాఖ డివిజన్ కానీ రైల్వే జోన్ కానీ ఏమి లాభమని ప్రశ్నిస్తున్నారు.

దీని మీద బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కేంద్రంతో మాట్లాడుతామని చెబుతున్నారు. దీంతో రైల్వే జోన్ విషయంలో అయితే కూటమికి పెద్దగా సంతోషం లేకుండానే ఈ డిమాండ్లు చేస్తున్నాయని అంటున్నారు. అయితే రాయగడకు వెళ్ళిన కేకే లైన్ ని విశాఖ డివిజన్ లో కలుపుతారా అన్నది ఒక చర్చ. ఎందుకంటే ఒడిశా ఈ విషయంలో పట్టుదలగా ఉంది. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాంతో ఏపీ కూటమి ప్రభుత్వం గట్టిగా హై లెవెల్ లో పట్టుబడితేనే ఈ పని అవుతుందని లేకపోతే లేదని అంటున్నారు.

కావాలనే ఒడిషాకు లాభం కోసమే కేకే లైన్ ని అక్కడ కలిపారు అని విమర్శలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే రైల్వే జోన్ విషయంలో ఇప్పటిదాకా సాగిన ఉద్యమాలు ఇపుడు కేకే లైన్ ని విశాఖ రైల్వే డివిజన్ లో విలీనం చేయాలని కొత్త ఉద్యమాలను చేసేలా పురి గొల్పుతున్నాయి.

Tags:    

Similar News