విశాఖ నుంచి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసే వారు అంతకంతకు పెరుగుతున్నారు. వైసీపీ అధినాయకత్వం మదిలో కొత్త వ్యూహాలు ఉండడంతో అభ్యర్ధులు కూడా దానికి తగినట్లుగా రేసులోకి వస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయితే విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఆయనకు టికెట్ దాదాపుగా కన్ ఫర్మ్ అయింది. ఎంవీవీ విశాఖ తూర్పులో గడప గడప కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు.
సో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరన్నది ష్యూర్ గా తేలిపోతోంది. మరి ఈసారి ఎవరిని పెడతారు అంటే వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ చేయనుంది. దాని ప్రకారం చూసుకుంటే విశాఖ నుంచి ఈసారి కాపులు కానీ బీసీలు కానీ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు. యాదవ సామాజికవర్గానికి కనుక చూసుకుంటే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు.
అయితే ఆయన మంచివారు నిబద్ధత కలిగిన నేత అయినప్పటికీ రాజకీయంగా దూకుడు స్వభావం లేని వారని అంటారు. పైగా ప్రత్యర్ధులు గట్టిగా ఉన్న చోట వ్యూహాలు ఉండాలి. దాంతో వంశీతో పాటు మిగిలిన వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ లిస్ట్ లో కొత్తగా చేరిన పేరు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్.
ఈయన వెలమ సామాజికవర్గానికి చెందిన బీసీ నేత. సౌమ్యుడు. మంచివారు అని పేరు. న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ నుంచి కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా గెలిచిన తైనాల వైసీపీలో ఏ పదవీ ఆశించకుండా పనిచేస్తున్నారు. వెలమలకు చాన్స్ ఇస్తే కచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు.
అలాగే కాపులకు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. వైసీపీ నుంచి కాపులలో చాలా మంది నేతలు ఉన్నారు. అవసరం అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని పోటీలోకి దించుతారు అని అంటున్నారు. ఆయన కాకపోతే కొత్త ముఖాన్ని అయినా బరిలోకి తెస్తారు అని అంటున్నారు. ఇక గవర సామాజికవర్గానికి చాన్స్ ఇవ్వదలచుకుంటే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని పోటీకి పెట్టవచ్చు అంటున్నారు.
అదే విధంగా మత్య్సకార సామాజికవర్గానికి చెందిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీకి రెడీగా ఉండమని కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అంటున్నారు. వైసీపీ 2014లో వైఎస్ విజయమ్మను పోటీకి దించింది.
2019లో ఎంవీవీకి టికెట్ ఇచ్చింది. ఒకసారి రెడ్డి, మరోసారి కమ్మకు అవకాశం ఇచ్చిన వైసీపీ ఈసారి కాపులు లేదా బీసీలు అని గట్టిగా ఆలోచిస్తోంది. ఈ సామాజిక సమీకరణలతో డ్యాం ష్యూర్ గా విశాఖ ఎంపీ సీటుని మరోసారి గెలిచి తీరుతామని భావిస్తోంది. మరి వైసీపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరు అవుతారు అన్నది చూడాల్సి ఉంది.