ఏపీలో బీజేపీ అభ్యర్థే సీఎం.. వేరే పార్టీలను మా భుజాన మోయం!

ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీలను తమ భుజాన మోయడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు.

Update: 2024-02-17 05:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. తమ కూటమిలోకి బీజేపీని కూడా ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీలను తమ భుజాన మోయడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థే ఏపీలో సీఎంగా ఉంటారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. తమతో వివిధ పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

గుజరాత్‌ లో గతంలో బీజేపీకి ఒకే సీటు ఉండేదని.. ఇప్పుడు తాము అక్కడ అధికారంలో ఉన్నామని విష్ణువర్ధన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్‌ లో కూడా బీజేపీ అధికారం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తమ పార్టీ అభ్యర్థే సీఎంగా ఉంటారని వ్యాఖ్యానించారు. 2014తో పోలిస్తే 2024 ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పారు.

ఇప్పటివరకు ఏపీలో తమకు, జనసేనకు మాత్రమే పొత్తు ఉందని విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేతగానే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారని తెలిపారు. వైసీపీ వైఫల్యాలు, దౌర్జన్యాలను వివరించేందుకు ఫిబ్రవరి 21 నుంచి పోరు యాత్ర చేపడతామని వివరించారు.

తెలంగాణలో తరిమేసిన షర్మిలను తెచ్చి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేశారని విష్ణువర్థన్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. షర్మిలను అద్దెకు తెచ్చి అధ్యక్షురాలిని చేశారని.. అంతకంటే సమర్థులు కాంగ్రెస్‌ కు రాష్ట్రంలో ఎవరూ దొరకలేదా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలో విష్ణువర్థన్‌ రెడ్డి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఇప్పటికే వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఏడో జాబితాను కూడా ప్రకటించింది. మరోవైపు ఇంతవరకు టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీతో పొత్తు కోసమే ఆ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. పొత్తుకు బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉంటారని, వేరే పార్టీలను తమ భుజాన మోయడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News