ఉక్కులో ఉద్వాసన పర్వం..ఇంతే సంగతులు ?

ఇపుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో మరో అడుగు ముందుకేసి నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు.

Update: 2025-01-12 15:30 GMT

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణం మీద ఒక్క మాట కూడా చెప్పకుండానే విశాఖ సభను ప్రధాని నరేంద్ర మోడీ ముగించేశారు అని ఉక్కు కార్మిక సంఘాలు ఆందోళన చేసినంత సమయం పట్టలేదు. ఇపుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో మరో అడుగు ముందుకేసి నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు.

ఉక్కులో ఉద్వాసన పర్వానికి తెర తీశారు అని అంటున్నారు. 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని 45 ఏళ్లు పైదాటిన వారు స్వచ్చంద పదవీ విరమణ చేయవచ్చునని యాజమాన్యం తాజాగా ఒక నోటీసు విడుదల చేయడంతో ఉక్కు కార్మిక లోకం సలసలా మండిపోతోంది. అంతే కాదు 2026 జనవరి నాటికి పదవీ విరమణ చేసే వారు కూడా వీఆర్ ఎస్ కి అర్హులే అని నోటీసులో పేర్కొంది.

విశాఖ ఉక్కులో పర్మనెంట్ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాలనే ఈ వీఆర్ఎస్ పధకాన్ని ప్రవేశపెట్టారు అని అంటున్నారు. విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ ద్వారా వేలాది మందిని ఇంటికి సాగనంపడం ద్వారా ఉక్కు భారాన్ని తగ్గించుకోవడం అదే సమయంలో ప్రైవేటీకరణకు మార్గాలను వేయడం జరుగుతోంది అని అంటున్నారు.

విశాఖ ఉక్కులో ఇప్పటికే పెద్ద ఎత్తున వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. అలా రిటైర్ అయిన వారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయని భర్తీ చేయలేదని కార్మిక నేతలు అంటున్నారు. దాంతో పని భారం ఒత్తిడి ఒక వైపు పెరిగిపోతూంటే మరో వైపు పనిలో నాణ్యత తగ్గిపోతోంది అని అంటోంది.

కొత్తగా ఉద్యోగాలను నియమించాల్సింది పోయి ఇపుడు వీఆర్ఎస్ పధకాన్ని తీసుకుని రావడం వెనక ప్రైవేటీకరణ కుట్ర ఉందని అంటున్నారు. ఉక్కులో శాశ్వత ఉద్యోగులను తొలగించుకుంటే రానున్న రోజులలో విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది అన్నదే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తొలిసారి విశాఖ వస్తున్నారని ఆయన విశాఖ ఉక్కు మీద స్పష్టమైన నమ్మకమైన మాట ఒకటి చెబుతారు అని కార్మిక లోకం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమి నేతలు ఎవరూ కనీస మాత్రంగా ఉక్కు విషయం గురించి ప్రస్తావించకపోవడం తోనే ఉక్కు జాతకం అర్ధం అయింది అని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా పోరాటం చేస్తున్నది ఒక్క వామపక్ష పార్టీలే తప్ప మరేవీ కావని అంటున్నారు. అందరూ కలసి విశాఖ ఉక్కు గొంతు నొక్కేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న మాటలు పూర్తిగా నీటి మూటలు అవుతున్న నేపథ్యం ఉందని అంటున్నారు. విశాఖ ఉక్కుని ఈ సమయంలో కాపాడుకోవాలీ అంటే ప్రజలంతా ఉవ్వెత్తున తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమించిన తీరున ఉద్యమించడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.

Tags:    

Similar News