సంక్షేమపథకాలు ఆదుకుంటాయా?

దీంతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులు, ఎంఎల్ఏలకు రైతులు, ఇతర లబ్దిదారుల నుండి బాగా నిరసనలు ఎదురవుతున్నాయి

Update: 2023-09-12 08:25 GMT

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సంక్షేమపథకాలు ఆదుకుంటాయని కేసీయార్ గంపెడాశతో ఉన్నారు. అయితే క్షేత్రస్ధాయిలో తిరుగుతున్న మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు పూర్తి వ్యతిరేకత అనుభవంలోకి వస్తోంది. ఎలాగంటే కేసీయార్ అమలుచేస్తున్న ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలుకావటంలేదట. పథకాలు అందుకుంటున్న లబ్దిదారులు కూడా ఏమంత సంతృప్తికరంగా లేరని ఫీడ్ బ్యాక్ వస్తోంది. దళితబంధు, బీసీ బంధు, చేతివృత్తుల చేయూత, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రైతు రుణమాఫి, మైనారిటీలకు ఆర్ధిక సాయం లాంటి అనేక పథకాలపై లబ్దిదారులు అంత తృప్తిగా లేరట.

కారణం ఏమిటంటే రైతు రుణమాఫీని తీసుకుంటే కేసీయార్ చెప్పినట్లుగా 50 లక్షల మందికి లబ్దిజరగాలి. కానీ సంవత్సరాలు పెండింగులో పెట్టి దశలవారీగా రుణమాఫీ చేయటానికి కేసీయార్ ప్లాన్ చేశారు. ఇందులో రు. 99,999 రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. తర్వాత రు. లక్ష రూపాయల మాఫీ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు రుణమాఫీని పెండింగ్ పెట్టిన కారణంగా ఇపుడు చేస్తున్న చెల్లింపులు వడ్డీలకు సరిపోతోందనే గోల మొదలైంది.

ఇలాంటపుడు నూరుశాతం రుణమాఫీ ఎప్పుడవుతుందో రైతులకు అర్ధంకావటంలేదు. కేసీయార్ ఏమో రుణమాఫీ చేసేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. కానీ వాస్తవంగా ఏమి జరుగుతోందన్న విషయం రైతులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటంలేదు. దాంతో వ్యవసాయానికి పెట్టుబడులు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిగిలిన పథకాల అమలు కూడా అరాకొరే జరుగుతోంది.

దీంతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులు, ఎంఎల్ఏలకు రైతులు, ఇతర లబ్దిదారుల నుండి బాగా నిరసనలు ఎదురవుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు విషయంలో ఏమవుతుందో అర్ధంకాక అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికితోడు ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ది ఎక్కువగా పార్టీ కార్యకర్తలకే పోతోందనే ఆరోపణలు విపరీతంగా జరుగుతోంది. దీంతో అధికారపార్టీ అంటేనే జనాలు మండిపోతున్నారు. ఇవన్నీ రేపటి ఎన్నికల్లో గెలుపుపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి ఈ సమస్యలకు కేసీయార్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News