టార్గెట్ మిస్ అయ్యాం:కేటీఆర్

అంతే కాకుండా 200 శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయంటూ సర్వే సంస్థలపై కేటీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.

Update: 2023-12-03 13:44 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ కాదని ఎగ్జాక్ట్ పోల్స్ ను తాము నమ్ముతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంతే కాకుండా 200 శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయంటూ సర్వే సంస్థలపై కేటీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలుగా రావడంతో తాజాగా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు.

తెలంగాణ ప్రజలు తమ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారని, అందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు. ఈరోజు వచ్చిన ఫలితం గురించి బాధపడడం లేదని, కానీ తాము ఆశించిన స్థాయిలో ఈ ఫలితం లేకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. అయితే, ఈ ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుంటామని, తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభం జరగాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు.

ఇక, గత రాత్రి తాను చేసిన ట్వీట్ పై కూడా కేటీఆర్ స్పందించారు. హ్యాట్రిక్ విక్టరీ లోడింగ్...3.0 వేడుకలకు సిద్ధంగా ఉండండి అంటూ తుపాకీని గురిపెడుతున్న ఫోటోను కేటీఆర్ షేర్ చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు అయిన తర్వాత కేటీఆర్ గన్ ఫొటో పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. కారు నాలుగు టైర్లను కేటీఆర్ సరిగ్గా గురిపెట్టి పేల్చేశారని, అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని సెటైర్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా గత రాత్రి ఫోటోనే రీట్వీట్ చేసిన కేటీఆర్ ఈసారి టార్గెట్ మిస్ అయ్యామంటూ కామెంట్ చేశారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే సర్వే సంస్థలకు క్షమాపణలు చెబుతారా అంటూ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News