ఐపీల్-2025.. కొత్త కెప్టెన్లు వీరేనా.. ఎన్నడూ లేనివిధంగా రికార్డు
2025 సీజన్ కు మెగా వేలం నడుస్తోంది. దీనికి ముందు రిటెన్షన్ జాబితాలో కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్యంగా తమ నిర్ణయాలను ప్రకటించాయి.
బహుశా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదేమో..? మొత్తం పది జట్లలో ఐదింటికి కొత్త సారథులు రావడం ఏమిటి..? సీజన్ లో ఒకటీ, రెండు టీమ్ లకు కూడా కెప్టెన్లు మారని పరిస్థితుల్లో సగం జట్లకు కెప్టెన్లు మారడం ఏమిటి..? వీటిలో ఇంకా రెండు జట్లకు కెప్టెన్లు ఎవరో తేలకపోవడం ఏమిటి..?
ఆ పది జట్లలో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొత్తం పది జట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అనే జట్లున్నాయి. వీటిలో ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు సీజన్ మొదటి నుంచి ఉన్నాయి. గుజరాత్, లక్నో 2022 నుంచి చేరాయి. గుజరాత్ తొలి సీజన్ లోనే టైటిల్ కొట్టింది. పంజాబ్, బెంగళూరు, లక్నో మాత్రం చాంపియన్ గా నిలవలేకపోయాయి.
ఈ ఐదు జట్లకు..
2025 సీజన్ కు మెగా వేలం నడుస్తోంది. దీనికి ముందు రిటెన్షన్ జాబితాలో కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్యంగా తమ నిర్ణయాలను ప్రకటించాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో కోల్ కతాను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్, ఢిల్లీని మంచి స్థితికి తీసుకొచ్చిన రిషభ్ పంత్, లక్నోకు కీలకంగా ఉన్న కేఎల్ రాహుల్ ను ఆ జట్లు రిటైన్ చేసుకోలేదు. పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడినీ పంజాబ్ రిటైన్ చేసుకోలేదు. బెంగళూరు కూడా డుప్లెసిస్ ను కెప్టెన్ గా కొనసాగించే ఉద్దేశంలో లేనట్లు తెలిసింది. కాగా, చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, ముంబైకి హార్దిక్ పాండ్యా, సన్ రైజర్స్ కు ప్యాట్ కమ్మిన్స్, రాజస్థాన్ కు సంజూ శాంసన్, గుజరాత్ కు శుబ్ మన్ గిల్ కెప్టెన్లుగా కొనసాగడం ఖాయం.
కొత్త కెప్టెన్లు వీరే..
లక్నోకు రికార్డు స్థాయిలో రూ.27 కోట్లు పెట్టి కొన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, ఢిల్లీ రూ.14 కోట్లు వెచ్చించిన కేఎల్ రాహుల్, పంజాబ్ రూ.25 కోట్లు పెట్టిన శ్రేయస్ అయ్యర్ లను కెప్టెన్లు చేసే అవకాశం ఉంది. బెంగళూరుకు మాత్రం టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వచ్చే సీజన్ బరిలో దిగనున్న కోల్ కతాకు కెప్టెన్ వెస్టిండీస్ ఆల్ రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ పేర్లు వినిపిస్తున్నాయి.