అసలు జగన్ పాస్ పోర్టు ఇష్యూ ఏమిటి?

అయితే.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేసుకు సంబంధించిన వివరాలు తన వద్ద లేవని.. వాటిని తెప్పించటానికి సమయం ఇవ్వాలని కోరారు.

Update: 2024-09-07 12:30 GMT

ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. అంతేనా.. బోలెడన్ని వ్యాపారాలు ఉన్నాయి. హంగుకు.. అర్భాటానికి కొదవ లేని ఆయనకు పాస్ పోర్టు జారీ విషయంలో ఎదురవుతున్న తలనొప్పులు ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఎందుకిలా జరుగుతోంది? అసలేమైంది? మొన్నటివరకు ఉన్న డిప్లమాటిక్ పాస్ పోర్టు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సాదాసీదా పాస్ పోర్టు ఎందుకు ఇస్తున్నట్లు? సాధారణంగా ఐదేళ్ల పాస్ పోర్టు కోసం అప్లై చేస్తే.. కోర్టు మాత్రం ఏడాదికే పరిమితం చేస్తూ అనుమతులు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది? అన్న విషయాలోకి వెళితే..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేశారు. ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కలేదు. దీంతో ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలారు. కాకుంటే.. వైసీపీ అధినేతగా వ్యవహరిస్తున్నప్పటికీ దాని వల్ల ప్రత్యేక చట్టపరమైన గుర్తింపు ఏమీ ఉండదు. నిజానికి సెప్టెంబరు 3 నుంచి 25 వరకు తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా లండన్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గతంలో మాదిరి ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. పాస్ పోర్టుకు సంబంధించిన అనుమతుల కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తన అంగీకారాన్ని తెలిపింది.

ఇంతవరకు అంతా బాగానే నడిచినా.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లమేటిక్ పాస్ పోర్టు ఉండేది. పదవి నుంచి దిగిన తర్వాత జనరల్ పాస్ పోర్టుకు మార్చుకోవాల్సి ఉంటుంది. డిప్లమాటిక్ పాస్ పోర్టు రద్దైంది. అందుకే ఆయన కొత్త పాస్ పోర్టు కోసం అప్లై చేసుకున్నారు. ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఇక్కడి వరకు జగన్ అండ్ కో అనుకున్నట్లే జరిగింది. ఆ తర్వాత అసలు పంచాయితీ మొదలైంది.

ఒక పరువు నష్టం కేసు జగన్మోహన్ రెడ్డిపై పెండింగ్ లో ఉంది. దీనికి ప్రత్యేక కోర్టు నుంచి నిరభ్యంతర ఉత్తర్వు తెచ్చుకోవాలని.. పాస్ పోర్టు అధికారులు జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేశారు. దీంతో ఆయన ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎన్ వోసీకి పలు కొర్రీలు పెట్టటమే కాదు.. కఠిన షరతులు విధించింది. అక్కడితో ఆగలేదు. ఏడాది పాటు మాత్రమే పాస్ పోర్టు రెన్యువల్ కు అనుమతిస్తామని చెప్పారు. అందుకు రూ.20వేల ష్యూరిటీ బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. సెప్టెంబరు 6 నుంచి 27 మధ్యలో మాత్రమే లండన్ కు వెళ్లాలన్న షరతులు విధించింది. సీబీఐ కోర్టు కొన్ని పరిమితుల్ని పెడితే.. ప్రత్యేక కోర్టు అదనంగా మరిన్ని పరిమితుల్ని విధించింది. దీంతో.. సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు కంటే తక్కువగా ఉన్న కారణంపై హైకోర్టులో లంచ్ మోషన్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.

అయితే.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేసుకు సంబంధించిన వివరాలు తన వద్ద లేవని.. వాటిని తెప్పించటానికి సమయం ఇవ్వాలని కోరారు. దీంతో.. ఇరు పక్షాల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ పిటిషన్ తదుపరి విచారణను సోమవారం చేపడతామని.. అదే రోజు నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో.. జగన్ పాస్ పోర్టు వ్యవహారం ఒక పట్టాన కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News