మంగళగిరి మ్యాజిక్ : లోకేష్ లెక్కేంటి...వైసీపీ ధీమా ఏంటి...!?

ఎందుకంటే ఒకసారి ఓటమి అందించిన చోట నుంచి మళ్లీ పోటీ చేయడానికి ఢక్కామెక్కీలు తిన్న వారు అయినా జంకుతారు.

Update: 2024-01-01 02:45 GMT

పోయిన చోట వెతుక్కోవాలన్నది ఒక ముతక సామెత. అవును నిజమే కదా. ఎక్కడైతే పోయిందో అక్కడే దొరుకుతుంది. కానీ వేరే చోటకు వెళ్తే జరిగే పనేనా. కానీ రాజకీయాల్లో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అంటే ఆలోచించ్ల్సిందే. ఎందుకంటే ఒకసారి ఓటమి అందించిన చోట నుంచి మళ్లీ పోటీ చేయడానికి ఢక్కామెక్కీలు తిన్న వారు అయినా జంకుతారు.

అయితే చంద్రబాబు కుమారుడు, టీడీపీ భావి వారసుడు అయిన నారా లోకేష్ మాత్రం మొండిగానే బరిలోకి దూకుతున్నారు. ఆయన మంగళగిరి నుంచి 2024లో మళ్లీ పోటీకి సై అంటున్నారు. ఇటీవలే ఆయన యువగళం పాదయాత్రను ముగించినుకుని వచ్చారు. అలా పదకొండు నెలల సుదీర్గ విరామం తరువాత మంగళగిరిలో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి చంద్రబాబు మళ్ళీ అక్కడ నుంచేనా పోటీ అని అడిగారు అని తాను అవును అని బదులిచ్చాను అని చెబుతున్నారు. అంతే కాదు ఈసారి గెలుపు పక్కా తగ్గేదే లే అని ఆయన క్యాడర్ ని ఉత్సాహపరచారు. 2019లో లోకేష్ ఎవరో తెలియదు, ఈసారి నేను అందరికీ తెలుసు. నా మనసు తెలుసు. నా నాయకత్వం ఎలా ఉంటుందో కూడా చూపించాను సో విజయం నాదే అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక వైసీపీ అయితే లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెడుతోంది. ఆయన 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి మీద ఓటమి పాలు అయ్యారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి సొంత సామాజికవర్గం ఓట్లే అరవై వేల దాకా ఉన్నాయి. పైగా ఆయన కమ్మవారి అల్లుడు అని అంటారు. అంటే ఆ విధంగా ఆ సామాజికవర్గం నుంచి కూడా ఓట్లు ఇటు టర్న్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

మిగిలిన బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరో వైపు చూస్తే టీడీపీ పెట్టాక కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. 1985 తరువాత ఆ పార్టీ గెలిచింది లేనే లేదు. దాంతో నాలుగు దశాబ్దాల హిస్టరీని తిరగరాస్తాను అని లోకేష్ అంటున్నారు. దానికి కారణం వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కలసి వస్తుందని, అమరావతికి చేరువలో ఉండడం వల్ల రాజధాని అంశం కూడా తమకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఆళ్ల వంటి వారు వైసీపీ నుంచి తప్పుకోవడం వల్ల కొంత నష్టం ఏమైనా ఉంటుందా అన్న చర్చ ఉంది. అయితే కులం బట్టి ఓట్లు పడతాయని భావిస్తున్న వారూ ఉన్నారు. లేకపోతే 2014 నాటికి గంజి చిరంజీవికి ఇంతగా హైప్ లేకపోయినా ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే గెలిచినట్లే అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీ ధీమా బీసీ ఓటు బ్యాంక్ గా ఉంది. లోకేష్ ధీమా టీడీపీ ఆశలు అమరావతి రాజధాని మీద ఉన్నాయి. మరి ఈ రెండింట్లో దేన్ని జనాలు ఎక్కువగా పట్టించుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా చూస్తే వైసీపీ రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజేత కావాలని ఉవ్విళ్ళూరుతోంది. లోకేష్ అంటే టీడీపీకి ఆశా కిరణం సో ఆయన ఈసారి ఓడరు గెలుపే అని ఆ పార్టీ అంటోంది. చూడాలి మరి మంగళగిరి మ్యాజిక్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News