అగ్ని కీలల్లో ఎమ్మెల్యే సంస్థ.. అసలు ఏమైంది?
ఈ ప్రమాదంలో రూ.70 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేశారు.
షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన కంపెనీలో భారీ నష్టం చోటు చేసుకుంది. ప్రాథమిక అంచనా ప్రకారం.. రూ.70 కోట్ల నష్టం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట గంగవరం సమీపంలో ఉన్న ఎస్‌హెచ్ మెగా ఫుడ్ పార్కులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.70 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఒక భారీ షెడ్, యంత్రాలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
రెండేళ్ల నుంచి గుండ్లకమ్మ నది పక్కనే 60 ఎకరాల్లో ఈ మెగా ఫుడ్ పార్కును నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోడి గుడ్లలో ఉండే తెల్ల సొన, పచ్చ సొనను వేరు చేసి పాశ్చరైజేషన్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడే కోళ్లను కూడా ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే యంత్రాలు ఉన్నాయి. జనవరి 13న సాయంత్రం సిబ్బంది పనులు ముగించుకుని బయటకు వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం 6,30 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని సమాచారం.
భారీ షెడ్ కావడంతో రాత్రి 8 గంటల వరకు ఈ అగ్ని ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే దర్శి, వినుకొండ, వైపాలెం అగ్ని మాపక కేంద్రాలకు సమాచారం అందించారు. అలాగే వినుకొండ నుంచి వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటికే కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలు దగ్ధమయ్యాయి. భారీ షెడ్డు నేలకూలింది.
అయితే షెడ్డు పక్కనే ఉన్న భారీ గ్యాస్ ట్యాంకర్లకు మంటలు తాకకుండా అగ్ని మాపక సిబ్బంది చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతకు షెడ్డు కూలిపోతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కోడి గుడ్లు ప్యాక్ చేసే అట్టపెట్టెలు ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపులోకి రాలేదు. పూర్తి స్థాయి నష్టం ఎంత ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
కాగా ఈ మెగా ఫుడ్ పార్క్ చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిదని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ పోటీ చేయనున్నారు.