లాల్ బహదూర్ శవ పేటిక మోసిందెవరో తెలిస్తే షాకే..
ఆయన శవాన్ని ఉంచిన బాక్సును పాకిస్థాన్ అప్పటి అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, రష్యా ప్రధాని కోస్గిన్ మోయడం.
భారత దేశ రెండో ప్రధానిగా.. చిరకాలం నిలిచిపోయే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన మహనీయుడిగా.. నిరాడంబరుడిగా.. నిజాయతీపరుడిగా.. కీర్తిపొందారు లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్ లాల్ నెహ్రూ వంటి మేరునగ ధీరుడి అకాలం మరణం తర్వాత దేశాన్ని అంతటి ప్రగతిశీ భావనలతో నడిపించేది ఎవరా? అని ఆలోచిస్తుండగా.. లాల్ బహదూర్ శాస్త్రి ఆ లోటును తీర్చారు. పేరులో విప్లవానికి చిహ్నమైన "లాల్ (ఎరుపు)" ఉన్నప్పటికీ .. శాస్త్రీజీ సౌమ్యుడు. శాంతి ప్రియుడు. అందుకనే తాష్కెంట్ లో శాంతి చర్చలకు వెళ్లారు. అక్కడే అనుమానాస్పద స్థితిలో తుదిశ్వాస విడిచారు
గాంధీ బాటలో.. నెహ్రూ అడుగుల్లో
1904 అక్టోబరు 2న పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి 1920లలో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు. స్వస్థలం.. కాశీ. గొప్ప విద్యావంతుల కుటుంబంలో పుట్టిన శాస్త్రి.. గాంధీజీ స్ఫూర్తితో 16-17 ఏళ్ల వయసుకే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గళమెత్తారు. అదే క్రమంలో నెహ్రూకు అనుంగు అనుచరుడిగా మారారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రమాదానికి బాధ్యుడిగా రాజీనామా
రాజకీయాల్లో నైతిక విలువలకు చిరునానామాగా లాల్ బహదూర్ శాస్త్రిని చెబుతారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రమాదం జరగ్గా.. తన తప్పు లేకున్నా నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు.
యుద్ధాన్ని ఆపి.. అర్థంతరంగా తనువు చాలించి..
సోదరుడిగా భావించిన చైనా యుద్ధానికి దిగి భారత్ ను ఓడించడంతో నెహ్రూ మానసికంగా కుంగిపోయి ప్రాణాలు విడిచారు. దీంతో 1964 జూన్ 9న శాస్త్రి దేశ రెండో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 జూలై 18 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. కాగా, వ్యవసాయం, పారిశ్రామికంగా కుదరుకోకుండానే.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోనే పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వడం.. చైనాతోనూ యుద్ధం జరిగిన నేపథ్యంలో శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం భారత జాతిని సమరోత్సాహంతో నడిపించింది. సహజంగానే శాంతి కాముకుడైన ఆయన 1965 లో పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటించారు. అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ తో తాష్కెంట్ లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు సారు. దీనికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించింది.
అనూహ్య మరణం..
ప్రధానిగా ఉన్న నెహ్రూ మరణం నుంచి తేరుకోకముందే.. రెండేళ్ల వ్యవధిలోనే మరో భారీ షాక్ ను ఎదుర్కొంది భారత్. అదేమంటే.. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే శాస్త్రి అక్కడ బస చేసిన హోటల్ లో చనిపోయారు. అయితే, దీనికి గుండెపోటే కారణమని చెప్పినప్పటికీ ఇతర అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏనే శాస్త్రి హత్యకు ప్రణాళిక వేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అందులోనూ అమెరికా- సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో.. నాటి సోవియట్ రష్యాలో భాగమైన తాష్కెంట్ భారత్ –పాక్ చర్చలకు వేదిక కావడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయిందనే వాదన ఉంది.
శవపేటిక మోసిన ఆయూబ్ ఖాన్.. కోస్గిన్
శాస్త్రి అకాల మరణం భారత్ ను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇదే సమయంలో మరో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన శవాన్ని ఉంచిన బాక్సును పాకిస్థాన్ అప్పటి అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, రష్యా ప్రధాని కోస్గిన్ మోయడం. అంతేగాక.. ఆ సందర్భంగా వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ గుర్తుంచుకోదగినవి. "ఇక్కడ శాశ్వత నిద్రలో ఉన్న వ్యక్తి బతికి ఉంటే గనుక భారత్-పాక్ లను దగ్గర చేసుకుండేవారు" అని ఆయూబ్ ఖాన్ వ్యాఖ్యానిస్తే.. "శాస్త్రిజీ.. సూపర్ కమ్యూనిస్టు" అని కోస్గిన్ కొనియాడారు.