ఎన్ కన్వెన్షన్ ఎందుకంత స్పెషల్.. రోజుకు దాని అద్దె ఎంత?
ఈ కూల్చివేత ఎపిసోడ్ ను పక్కన పెడితే.. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకంత స్పెషల్ అన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోట ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని మెరుపు వేగంతోకూల్చేయటం.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారుల నేలమట్టంచేసిన వైనం.. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ కూల్చివేత ఎపిసోడ్ ను పక్కన పెడితే.. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకంత స్పెషల్ అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ ఫంక్షన్ చేసుకోవటానికి చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తారు. కొందరు అయితే.. తాము జరుపుకునే వేడుకలకు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఖాళీగా లేకుంటే.. తమ ఈవెంట్ ను వాయిదా వేసుకున్న సందర్భాలు లేకపోలేవు. కాంక్రీట్ జంగిల్ మాదిరి ఉండే హైదరాబాద్ మహానగరంలో ఒక లేక్.. దాని పక్కనే ఉండే ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నంగానే కాదు.. ఇక్కడి పరిసరాలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయని చెబుతారు. దీనికి తోడు హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో.. హైటెక్స్ కు కాస్తంత దూరంలో ఉంటుంది. మరింత క్లియర్ గా చెప్పాలంటే.. శిల్పారామం ఎదురుగా.. కాస్తంత లోపలగా ఉంటుంది. అందరికి అనువుగా ఈ ప్లేస్ కు.. తమ్మిడికుంట చెరువును అనుకొని ఉండటం మరో ప్రత్యేకతగా చెబుతారు.
ఎన్ కన్వెన్షన్ లో నాలుగు వేదికలు ఉన్నాయి. అందులో ఒకటి 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 వేల మంది కూర్చునే ప్రధాన హాల్ సో స్పెషల్ గా చెబుతారు. ఖరీదైన వివాహాలు.. రిసెప్షన్లు.. భారీ ఫ్యాషన్ షోలో.. సినిమా వేడుకలు మాత్రమే కాదు.. ఐటీ కంపెనీల ప్రత్యేక వేడుకల్ని ఇందులోనే నిర్వహిస్తుంటారు. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోనే 37 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భారీ గార్డెన్ లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు.. వేడుకల్ని నిర్వహిస్తుంటారు.
మరో వేదిక 5 వేల చదరపు అడుగుల పరిధిలో డైమండ్ హాల్ ఉంటుంది. అందులో 500 మందితో చిన్న వేడుకల్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు ఉంది. దీని బయట ఉండే మర్రిచెట్టు చెంత బనియాన్ పేరిట ఓపెన్ ఎయిర్ వెన్యూ 26వేల చదరపు అడుగుల్లో ఉంది. వీటికి అదనంగా ఏడు వేల చదరపు అడుగుల్లో అనెక్స్ హాల్ ను నిర్మించారు. ఇంత భారీ వేదిక.. అది కూడా హైటెక్ సిటీ సమీపంలో ఉండటంతో అందరూ దీన్ని ఎంచుకోవటానికి ఆసక్తిని చూపేవారు.
భారీ ఎత్తున కారు పార్కింగ్ కు అవకాశం ఉండటంతో.. ప్రముఖులు తమ ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు దీన్ని వేదికగా చేసుకుంటూ ఉంటారు. దీని అద్దె కాస్త ఎక్కువే. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇక్కడ అద్దె రూ.5 లక్షలతో మొదలవుతుందని చెబుతారు. ఎన్ కన్వెన్షన్ లో ఫంక్షన్లు నిర్వహించటం హోదాకు చిహ్నంగా భావించే వారు ఉన్నారు. అందుకే హైదరాబాద్ మహానగరంలో చాలానే కన్వెన్షన్ సెంటర్లు ఉన్నా.. ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్త భిన్నమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కొసమెరుపు ఏమంటే.. వివాదాలతో మొదలైన ఎన్ కన్వెన్షన్ ప్రస్థానం.. అదే వివాదంతో ముగియటం.. అది కూడా ప్రారంభించిన పద్నాలుగేళ్లకే కావటం గమనార్హం.