కేసీఆర్ లో పెరిగిన ధీమా...రీజనేంటో ?
ఆయన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బస్సు యాత్ర ఒకటి చేపట్టారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో ధీమా బాగా పెరిగింది. సరిగ్గా ఏడాది క్రితం అధికారం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాటి నుంచి నేటి వరకూ దాదాపుగా అత్యధిక కాలం ఫార్మ్ హౌస్ లోనే ఉంటూ వస్తున్నారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బస్సు యాత్ర ఒకటి చేపట్టారు. ఆ మధ్య ఒకటి రెండు సభలలో పాల్గొన్నారు.
ఇక చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఏ ఒక్క విమర్శకు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చినదీ లేదు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన మీడియాకూ జనానికీ దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అంతమాత్రం చేత కేసీఆర్ తగ్గిపోయారు అని ఎవరూ భావించడం లేదు. అదే సమయంలో కేసీఆర్ చాణక్య రాజకీయాలూ వ్యూహాలకు ఎప్పటికపుడు పదును పెడుతూ ఉంటారని ఆయన గురించి ఎరిగిన వారు చెప్పే మాట. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ఏడాది పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేసీయార్ తనలో నిండుగా ఆత్మ విశ్వాసం నింపుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ కి వచ్చి కొంతమంది నేతలు బీఆర్ ఎస్ లో చేరారు. దాంతో వేయింతల బలంతో కేసీఆర్ చేసిన ప్రసంగం అయితే ఇపుడు ఆసక్తిని కలిగిస్తోంది. మళ్లీ తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఅర్ పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.
వందకు వంద శాతం బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతుందని కేసీఆర్ బల్లగుద్దుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా ఏడాదికి దగ్గర అవుతోందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ప్రజలకు తాము ఏమి కోల్పోయామన్నది అర్ధం అయింది అని కేసీఆర్ తనదైన రాజకీయ విశ్లేషణ వినిపించారు.
దాంతో పాటు ప్రజలంతా బీఆర్ ఎస్ వైపే ఉన్నారని వారు బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారని కూడా ఆయన అనడం గమనార్హం. బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఉత్సహం నింపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసినా ఎవరూ ఫికర్ కావాల్సిన అవసరం అయితే లేదని ఆయన భరోసా ఇచ్చారు.
ఎపుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన కుండ బద్ధలు కొట్టారు. ఇటీవల కాలంలో కేసీఆర్ ఈ తరహా ధీమా అయితే వ్యక్తం చేయలేదు. మరి ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ కి అర్ధం అయిందా ఆయన దగ్గర ఉన్న అంచనాలు ఆ విధంగా ఉన్నాయా లేక పార్టీ శ్రేణులను ఉత్సహ పరచేందుకు ఆయన ఈ మాట అంటున్నారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చాలా కాలానికి కేసీఆర్ నోటి నుంచి ఈ రకమైన ప్రకటనలు రావడంతో గులాబీ తోటలో మళ్లీ హర్షం వ్యక్తం అవుతోంది.