ఇకనైనా.. ఢిల్లీ రాజకీయం మారేనా?
అంతేకాదు.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్నికట్టడి చేసేందుకు.. మోడీ సర్కారు తెచ్చిన మరో చట్టం కూడా.. ఢిల్లీ పాలకులకు శాపంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకు న్న ప్రభుత్వం ఏర్పడినా.. మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా.. దాదాపు ప్రధాన అధికారాలు అన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు లేని విధంగా ఇక్కడ కేంద్రం అజమాయిషీ కనిపిస్తుంది. అంతేకాదు.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్నికట్టడి చేసేందుకు.. మోడీ సర్కారు తెచ్చిన మరో చట్టం కూడా.. ఢిల్లీ పాలకులకు శాపంగా మారింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చిన్నస్థాయి ప్యూన్‌ను సైతం బదిలీ చేసే అధికారం లేకుండా.. కేంద్రం కొత్త చట్టం ద్వారా అధికారం బదలాయించుకుంది. ఇక, ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం.. పోలీసులు, శాంతి భద్రతలు, ఎక్సైజ్, వంటి కీలక శాఖలు.. కేంద్రం పరిధిలోనే ఉంటాయి. అయితే.. రెవెన్యూ మాత్ర మే రాష్ట్ర సర్కారు పరిధిలో ఉన్నా.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలే.. ఆప్ ప్రభుత్వానికి చేతులు కాళ్లు ఆడకుండా చేశాయి.
ఇక, ఇప్పుడు బీజేపీ సర్కారే పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు సహకరించడం ఖాయమే. ఎందుకంటే.. రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కారే కాబట్టి.. సహకారంపై ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇక్కడే మరో కీలక విషయం ఉంది. ఆప్‌పై కోపంతో తెచ్చిన నూతన అధికారాల చట్టం విష యాన్ని ఏం చేస్తారన్నది ప్రశ్న. ప్రతి దానికీ కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం కల్పించిన ఈ చట్టం .. అలానే కొనసాగుతుందని కొందరు చెబుతుంటే.. కాదు మార్పు చేస్తారని మరికొందరు అంటున్నారు.
ఇక, పోలీసుల నియంత్రణ, శాంతి భద్రతలు వంటి అధికారాలను రాష్ట్ర సర్కారుకు తాత్కాలికంగా అయి నా.. బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, గత పాలకులపై కేసుల విచారణ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వంటివి రాష్ట్ర సర్కారే చూసే అవకాశం ఉందని సమాచారం. తాజాగా సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మార్చి నుంచి వాటిని పట్టాలెక్కిస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తే.. రాష్ట్ర ఢిల్లీకి- కేంద్ర ఢిల్లీకి మధ్య గ్యాప్ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.