ఎన్టీఆర్ కి భారత రత్న ఎపుడు వస్తుంది ?

ఎన్టీఆర్ కి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో సరిసాటి ఎవరూ లేరు.

Update: 2025-01-18 13:30 GMT

అనగనగా ఒక భారతరత్న ఒక అన్న గారు. నిజం చెప్పాలంటే ఇది కధ కాదు. కానీ అశేషమైన సశేషమైన కధగా ఉంది. అన్న గారు అని అఖిలాంధ్ర జనాలు చేత ఆప్యాయంగా పిలిపించుకున్న ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు తెలుగు జాతిని మంత్రాక్షరాలుగా కుదిపేస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ కి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో సరిసాటి ఎవరూ లేరు. ఆయన విజయాలు అనన్యమైనవి.

అన్న గారు ఫలనా రికార్డు ని కోరుతూ ఏ పని చేయలేదు. ఆయన సినిమా అయినా రాజకీయం అయినా అన్నీ నిజాయతీగా చేశారు. దానికి జనాలు నీరాజనాలు పట్టారు. అయితే ఆయనకు దక్కాల్సిన గౌరవాలు పురస్కారాలు దక్కాయా అంటే అది అన్న గారి అభిమానులకు ఎప్పటికీ ఒక చింతగానే ఉంటుంది.

ఎందరో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందులో కొందరికి అర్హత లేక పోయినా ఇతర కారణాలతో దక్కిన సందర్భాలు కూడా అంతా చూస్తున్నారు. అలాంటిది వంక పెట్టలేని ప్రతిభా సామర్ధ్యాలు కలిగి ఒకే సారి రెండు కీలక ప్రజా రంగాల్లో రాణించి సూపర్ హిట్ అనిపించుకుని కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యుడే కాదు ఎంతో స్పూర్తిగా నిలిచిన అన్న గారికి భారతరత్న ఈ రోజుకీ ప్రకటించకపోవడం బాధాకరం.

నిజానికి అన్న గారు భౌతికంగా ఈ లోకం నుంచి దూరమై 29 ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు కూడా ఇటీవలనే జరిగాయి. అన్న గారు కేవలం తెలుగు జాతికి మాత్రమే కాదు భారత జాతిని మొత్తాన్ని ప్రభావితం చేసిన మేటి నాయకుడు.

ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో తనదైన ప్రభావం చూపించారు. నేషనల్ ఫ్రంట్ ని కట్టి అప్పటికి 400 పై చిలుకు ఎంపీ సీట్లతో బలంగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని దించడంతో అతి ముఖ్య పాత్ర పోషించారు.

కుడి ఎడమలు గా ఉన్న బీజేపీని కమ్యూనిస్టులను కలిపారు. దేశానికి సంక్షేమ పధకాలను పరిచయం చేశారు బడుగు బలహీనులు రైతులు మహిళలు ఈ వర్గాలను పాలకులు ఎల్లప్పుడూ సమాదరించాలన్న సందేశాన్ని దేశానికి ఇచ్చిన గొప్ప పరిపాలన దక్షుడు అయిన అన్న గారికి భారత రత్న పురస్కారం ఈ రోజు వరకూ అందకపోవడం మాత్రం బాధాకరమే చెప్పాలి

ఇదిలా ఉంటే అన్న గారికి భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆయన మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పడంతో మరో మారు ఈ అంశం చర్చకు నోచుకుంది. లోకేష్ హైదరాబాద్ లోని అన్న గారి సమాధి వద్ద ఆయన 29వ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక ప్రభంజనం సృష్టించారు అని కొనియాడారు. ఆయన పాలనలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారని కూడా గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే ప్రతీ ఏటా జరిగే ఎన్టీఆర్ జయంతులు వర్ధంతుల వేళ ఆయనకు నివాళి అర్పిస్తున్న నాయకులు భారత రత్న ఆయనకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక చూస్తే గడచిన 29 ఏళ్లలో ఎంతో మందికి భారత రత్న అవార్డు దక్కింది. ఇక 1996 నుంచి ఈ రోజు వరకూ చూస్తే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు 17 ఏళ్ల పాటు ఉన్నాయి. అంటే అత్యధిక కాలం అన్న మాట.

ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా టీడీపీ భాగస్వామిగా ఉంటూ వచ్చాయి. అప్పట్లో వాజ్ పేయి ప్రధాని కావడానికి టీడీపీ మద్దతు కీలకం అయింది. ఈ రోజున మూడవసారి మోడీ ప్రధాని కావడానికి టీడీపీ మద్దతు చాలా కీలకంగా ఉంది. మరి ఇంతలా టీడీపీ కేంద్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్ని అర్హతలు ఉన్న అన్న గారికి భారత రత్న ఎందుకు రాదు అన్నదే చర్చనీయాంశం అవుతోంది.

ఈసారి అయినా అన్న గారికి భారత రత్న రావాలని అందరి కోరిక. మరి అది తీరుతుందా ఎపుడు వస్తుంది అన్న ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి మరి. ఏది ఏమైనా తెలుగు జాతి వెలుగుగా ఉన్న ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డు అంటే అది యావత్తు తెలుగు జాతికి వచ్చినట్లే అన్నది కూడా వాస్తవం. అలా తెలుగు వారు ఈ అరుదైన గౌరవం కోసం ఎదురుచూస్తూనే ఇప్పటికీ ఉన్నారు.

Tags:    

Similar News