ఇది టీడీపీ - జనసేన మేనిఫెస్టో... బీజేపీది కాదా?
అవును... తాజాగా చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది.
ఏపీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఆ రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశారు! ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో... బాబు – పవన్ లు దీన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో... కాస్త జాగ్రత్తగా పరిశీలించినవారు... ఇది టీడీపీ - జనసేన మేనిఫెస్టోయే తప్ప ఎన్డీయే మేనిఫెస్టో కాదు అని నొక్కి చెబుతున్నారు!
అవును... తాజాగా చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అలా అని ఈ మేనిఫెస్టోకు బీజేపీ నైతిక బాధ్యత తీసుకుంటుందనుకుంటే పొరపాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. దీంతో... ఈ తాజా మేనిఫెస్టో విషయంలో బీజేపీ నుంచి అధికారికంగా ఏపీ ప్రజలకు ఎలాంటి భరోసా లేదనే చర్చ తెరపైకి వచ్చింది!! దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు!
అందులో ఒకటి... ఈ మేనిఫెస్టో కవర్ పేజీపై కేవలం చంద్రబాబు – పవన్ కల్యాణ్ ల ఫోటోలు మాత్రమే ముద్రించబడి ఉన్నాయి. కవర్ పేజీలో ఎక్కడా మోడీ ఫోటో మచ్చుకైనా కనిపించలేదు! ఇదే సమయంలో.. మేనిఫెస్టో విడుదల సమయంలో... పవన్ - చంద్రబాబులతో ఆ పుస్తకాన్ని విడుదల చేయడానికి కూడా బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పూర్తిగా సహకరించలేదని అంటున్నారు!
తనకు మేనిఫెస్టో కాపీని అందిస్తుంటే.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా రియాక్షన్ ఇచ్చి.. కాస్త దూరం జరిగి.. చప్పట్లు కొట్టడుతూ కనిపించారు! ఇది కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ప్రక్రియ కానే కాదని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ఏమి కావాలి? ఇంతకు మించి ఉదాహరణలు అడిగితే.. అంతకు మించిన అవగాహనా రాహిత్యం, అజ్ఞానం ఉండదని కూడా చెప్పే ప్రమాదం లేకపోలేదుగా? అనేది పలువురి అభిప్రాయంగా ఉంది!
దీంతో... 2023లో కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని.. 2019లో వైఎస్ జగన్ ఇచ్చారని కొన్ని హామీలను కంట్రోల్ సీ – కంట్రోల్ వీ చేశారే తప్ప.. సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకుని, 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అవగాహనను రంగరించి ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా లేదని అంటున్నారు పరిశీలకులు! అందువల్లే బీజేపీ నుంచి మద్దతు కొరవడి ఉండొచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో... చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుందని.. అందువల్లే కూటమి మేనిఫెస్టోకు ఆ పార్టీ దూరంగా ఉందని.. ఈ క్రమంలోనే మేనిఫెస్టోలో మోడీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ, బాబు & కో కు అల్టిమేటం జారీ చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలోనే... జేపీ నడ్డా, అమిత్ షా, పురేందేశ్వరి ఫొటోలు కూడా లేకుండా కేవలం పవన్ – చంద్రబాబు ఫోటోలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారని అంటున్నారు.
ఈ క్రమంలో... మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ చెప్పిన టీడీపీ... కేవలం చంద్రబాబు - పవన్ ఫోటోలతో 2014 మేనిఫెస్టో విడుదల చేసిందని.. ప్రచారం మాత్రం మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అంటూ చేస్తున్నారని నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఎమిటంటే... ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో స్పందించిన చంద్రబాబు... “జాతీయ స్థాయిలో ఎన్డీయే అక్కడ మేనిఫెస్టో ఇచ్చింది.. రాష్ట్రస్థాయిలోని మేనిఫెస్టోతో వారు అసోసియేట్ కావడం లేదు.. అయితే.. దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాడ విశ్వాసం, నమ్మకం...!” అని చెప్పుకొచ్చారు.
దీంతో... రాష్ట్ర స్థాయిలో ఎంపీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా వారంతా జాతీయస్థాయిలో పార్లమెంట్ కు వెళ్లేది..? అలాంటప్పుడు తమ కూటమిలోని పార్టీలు రాష్ట్రస్థాయిలో ఇచ్చే హామీలకు ఆ ఎన్డీయే కూటమి పెద్దగా బీజేపీ సహకారంపై స్పష్టత లేకపోతే ఎలా..? అన్ని కొంతమంది ప్రశ్నిస్తుంటే... 2014 లో రెండు మూడేళ్ల తర్వాత కూటమి ఐకమత్యం, ఏపీ భవిష్యత్తుకు కేంద్రం సహకారం వంటి విషయాలపై క్లారిటీ వస్తే... ఈసారి మాత్రం ఏకంగా మేనిఫెస్టో సమయంలోనే క్లారిటీ వచ్చేసిందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు!