ఆ పేట పంచాయతీ తెగేనా?
తాజాగా ఆయన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు పిలిచి చర్చించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో నరసరావుపేట ఒకటి. అసెంబ్లీ స్థానంతోపాటు పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసిన వైసీపీ అధినేత జగన్ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థిపై పార్టీ నేతలతో చర్చోపచర్చలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు పిలిచి చర్చించారు.
ఈ నేపథ్యంలో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలనే సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనను మార్చొద్దని ఆయనకే వచ్చే ఎన్నికల్లోనూ సీటు ఇవ్వాలని సలహా ఇచ్చినట్టు సమాచారం.
కాగా 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ రెండుసార్లు గుంటూరు ఎంపీగా టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో గుంటూరులో ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలనుకుంటున్న జగన్... నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ కోవలోనే నరసరావుపేట ఎంపీ సీటును వైసీపీ అధికారి ప్రతినిధి, ఏపీ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న యనమల నాగార్జున యాదవ్ కు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా నాగార్జున అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. అతడు అనామకుడిని, పార్టీ పేరు చెప్పుకుని పలు అక్రమాలకు పాల్పడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ మూడో విడత జాబితాలోనే ప్రకటించాల్సిన నరసరావుపేట పార్లమెంటు సీటుకు జగన్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకున్న జగన్ వారితో చర్చించారు. వారంతా ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే పేరే సూచించడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయననే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సీటును ఆశించిన నాగార్జున యాదవ్ కు నిరాశ తప్పదని అంటున్నారు.