ఫ్లాష్ ప్లాష్.. ఫోన్లకు పెద్ద శబ్దంతో ఎమర్జెన్సీ అలర్ట్.. కంగారొద్దు..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటోంది. అది బేసిక్ మోడల్ అయినా కానీ, ఖరీదైన ఐఫోన్ అయినా కానీ.. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటోంది. అది బేసిక్ మోడల్ అయినా కానీ, ఖరీదైన ఐఫోన్ అయినా కానీ.. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. సమాచార వినిమయానికి సెల్ కీలకంగా మారింది. అయితే ,ఇదే సమయంలో ప్రభుత్వాల సమాచారం చేరవేతకు కూడా సెల్ ఫోన్ ఓ సాధనమైంది. సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకోవడం కూడా సెల్ ఫోన్ కారణంగానే జరుగుతోందనే సంగతి అందరికీ తెలిసిందే.
కొద్ది రోజులుగా సెల్ ఫోన్ వినియోగదారులకు ఓ సందేశం వస్తోంది. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో దీనిని పంపారు. ఈ సందేశం ఆడియో రూపంలోనూ వినిపించింది. అత్యవసర సందేశంతో కూడుకున్న ఆ సందేశాన్ని చూసి వినియోగదారులు కంగారు పడుతున్నారు. పెద్దగా చదువుకోనివారు ఏదో జరుగుతోందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లాష్ మెసేజ్ చూసి మరికొందరు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇలాంటి సందేశాలు ఐదు రోజులుగా వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంగారు పడొద్దని కేంద్ర ప్రభుత్వం గురువారం సందేశం పంపింది. టెన్షన్ చెందవద్దని భరోసా ఇచ్చింది.
సందేశం చూసి కంగారు..
దేశంలో కొందరు మొబైల్ వినియోగదారులకు కొద్ది సేపటి కిందటివరకు ఈ 'ఎమర్జెన్సీ అలర్ట్' సందేశం వచ్చింది. మామూలు మెసేజ్ అయితే పట్టించుకోకపోయేవారు. కానీ, 'తీవ్ర పరిస్థితి' అన్న అర్థంతో ఈ ఫ్లాష్ మెసేజ్ ఉంది. అసలే రకరకాల సందేశాలు పంపి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న రోజుల్లో.. ఇలాంటి మెసేజ్ రావడంతో ప్రజలు కొంత కంగారు పడుతున్నారు. ఈ మెసేజ్ ఎక్కడినుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక గందరగోళం చెందుతున్నారు. దీనికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భయపడాల్సేందేమీ లేదని స్పష్టం చేసింది.
''ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్''
ప్రజల ఫోన్లకు ప్రస్తుతం వస్తున్న సందేశం.. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లోనిది. అయితే, కొన్ని రోజులుగా ఈ మెసేజ్ పలు ప్రాంతాల ప్రజలకు వెళ్లింది. గురువారం సైతం సందేశం రావడంతోనే ప్రజలు ఆలోచనలో పడ్డారు. అందులోనూ ''ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్'' పేరిటి ఈ సందేశం ఉండడం గమనార్హం. కాగా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్ కాస్టింగ్ నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. వినియోగదారుల కంగారు నేపథ్యంలో కేంద్రం వివరణ ఇచ్చింది.. ''మీకు వస్తున్న మెసేజ్ ను పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ను పరీక్షించేందుకు ఉద్దేశించనది ఇది. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరం. తద్వారా ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది'' పేర్కొంది.
ఓకే క్లిక్ చేస్తే చాలు..
ప్రభుత్వం పంపుతున్న మెసేజ్ కిందనే ''ఓకే'' ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఆప్షన్ ను క్లిక్ చేయగానే.. మరో మెసేజ్ ఉంది. 'మీకు వైర్‌లెస్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎమర్జెన్సీ మెసేజ్ లను పొందేందుకు మీ ఆప్షన్‌ను ఎంచుకోండి' అని ఉంది. ఫోన్ సెట్టింగ్స్ లోనూ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ చేరింది. ఫోన్లకు వచ్చిన ఈ ఫ్లాష్ మెసేజ్ ను కొందరు యూజర్లు నెట్ లో పెడుతున్నారు. కాగా, మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్‌కాస్టింగ్ వ్యవస్థల అత్యవసర ప్రసార సామర్థ్యాల అంచనాకు ఈ పరీక్షలు చేపడుతున్నట్లు టెలీ కమ్యూనికేషన్ శాఖ గతంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశల వారీగా నిర్వహిస్తున్నట్లు వివరించింది. జూలై 20, ఆగస్టు 17న సైతం కొందరికి మెసేజ్ వెళ్లింది. భూకంపాలు, సునామీలు, వరదలు ఆకస్మిక విపత్తులు. ఈ సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ అలర్ట్ ను రూపొందించింది. ప్రస్తుతం దానిని పరీక్షించింది.