ప్రతిపక్షంగా ఆ పనిచేయలేకపోతున్నాం.. వైసీపీలో తర్జనభర్జన

ఐదేళ్లు అప్రతిహత అధికారం చలాయించిన వైసీపీ పది నెలల క్రితం ఊహించని పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-01 03:54 GMT
Ysrcp Leadership Silence In Party issues

ఐదేళ్లు అప్రతిహత అధికారం చలాయించిన వైసీపీ పది నెలల క్రితం ఊహించని పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలలు కన్న ఆ పార్టీ నేతలు అనూహ్య ఓటమితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని విధంగా ఘోర పరాజయం ఎదురుకావడం, గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలతో కొందరు అండర్ గ్రౌండుకి వెళ్లిపోగా, మరికొందరు పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇంకొందరు ఏకంగా రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో కార్యకర్తలు కూడా డీలా పడిపోతున్నారని అంటున్నారు. దీంతో పది నెలలుగా ఫ్యాన్ కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారని చెబుతున్నారు. పది నెలలుగా పార్టీ అగ్ర నాయకత్వం కూడా పెద్దగా కనిపించకపోవడంతో పార్టీ స్పీప్ మోడ్ నుంచి ఎప్పుడు బయటపడుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతోంది. ఈ పది నెలల్లో చోటుచేసుకున్న రాజకీయాలతో ప్రతిపక్షం వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. 164 సీట్లతో అధికారం దక్కించుకున్న టీడీపీ కూటమి, ప్రతిపక్ష కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర వైసీపీని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో స్కాములు జరిగాయంటూ లీకులిస్తూ గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. అదేసమయంలో సోషల్ మీడియాలో దుర్భాషలను తెరపైకి తెచ్చి పాత వీడియోలపైనా కొత్తగా కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో అటు నాయకులు, ఇటు కార్యకర్తలు అరెస్టులతో హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అగ్ర నాయకత్వం భరోసాగా నిలిచి పార్టీ కేడరులో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సివుంటుందని అంటున్నారు. కానీ, ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ ఆ పనిచేయడంలో విఫలమవుతోందని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఎన్నికల్లో పరాజయం తర్వాత అధినేత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. ఓటమి తర్వాత కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రభుత్వంపై పోరాడుతానని చేసిన ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోయాయంటున్నారు. ఈ పది నెలల కాలంలో కేవలం గుంటూరులో మిర్చి రైతుల సమస్యపై పోరాటమే తప్ప, మిగిలిన కార్యక్రమాలకు అధినేత హాజరుకాకపోవడవం కూడా కేడర్ ను నైరాశ్యంలోకి నెడుతోందని అంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన యువత పోరు, రైతు గర్జనకు కూడా అధినేత సహా అగ్రనేతలు ఎవరూ కనిపించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లో నేతలు తప్ప రాష్ట్రస్థాయిలో కార్యక్రమం నిర్వహించకపోవడం కూడా కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తోందని అంటున్నారు.

అధినేత జగన్ రాకపోయినా, పార్టీలో ఆయన తర్వాత పొజిషన్లలో ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా ప్రజా ఉద్యమాల్లో కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోందని అంటున్నారు. ప్రతి పనికీ అధినేత ఉండాల్సిన అవసరం లేదని, కానీ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇతర అగ్రనేతలు కనిపించాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోరాటాలన్నీ జిల్లా, నియోజకవర్గాలకు వదిలేయడం వల్ల పెద్దగా ప్రభావం చూపడం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నామని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అమలు అవుతున్నాయనేది పర్యవేక్షించాల్సిన యంత్రాంగం పార్టీలో లేదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఫలానా పోరాటం చేయండంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడమే తప్ప, ఎవరెవరు ఏమేం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదంటున్నారు. దీంతో ఎవరికి నచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా కార్యక్రమాలు వెలవెలబోతున్నాయంటున్నారు. స్థానిక ఎన్నికలు తరముకొస్తున వేళ వైసీపీ మేలుక్కోకపోతే భవిష్యత్తులోనూ చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News