వైసీపీ కొత్త లెక్క... వైనాట్ 215

ఇంతకీ 215 నంబర్ వెనకాల కధేంటి అంటే ఏపీలో జమిలి ఎన్నికలు జరిగినా లేక 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.

Update: 2024-11-07 12:11 GMT

వైనాట్ 175 అన్నది 2024 ఎన్నికల కోసం వైసీపీ ఇచ్చిన ఒక స్లోగన్. అయితే ఆ స్లోగన్ పవర్ ఏమీ లేదని జనాలు తేల్చేశారు. ఏకంగా 11 సీట్లకే పరిమితం చేశారు. ఆరు నెలలు అయింది వైసీపీ ఓటమి పాలు అయింది.

ఇపుడు చూస్తే వైసీపీ వచ్చే ఎన్నికల కోసం అపుడే పెద్ద టార్గెట్ పెట్టుకుంటోంది. నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగాయి. కానీ వైసీపీ మాత్రం వచ్చే ఎన్నికల కోసం భారీ లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతోంది. వై నాట్ 215 అని కొత్త నంబర్ తో వైసీపీ న్యూ స్లోగన్ ని బయటకు తీసింది.

ఇంతకీ 215 నంబర్ వెనకాల కధేంటి అంటే ఏపీలో జమిలి ఎన్నికలు జరిగినా లేక 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఆ విధంగా చూస్తే 175 కాస్తా 225 సీట్లు అవుతాయి. అందులో నుంచి 215 సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారన్న మాట.

దీని మీద వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ వి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలో వైసీపీ 215 సీట్లను సాధిస్తుందని తనదైన జోస్యం వినిపించారు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన సీట్లు పది మాత్రమే అన్న మాట.

అంత చిత్తుగా కూటమిని ఓడించగలమన్న ధీమాను ఆయన వైసీపీ శ్రేణులతో పంపించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు 2027లోనే వస్తాయని విజయసాయిరెడ్డి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉంది కాబట్టి 2027లో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో అసెంబ్లీ సీట్లు కూడా 34 నుంచి 44కి చేరే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అయితే రానున్న ఎన్నికల్లో ఈ మొత్తం అన్ని నియోజకవర్గాలన్నింటిలోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేయడం విశేషం.

ఇదిలా ఉంటే సాయిరెడ్డి డీ లిమిటేషన్ ని కూడా ఊహించి ఈ కొత్త టార్గెట్ ని ప్రకటించారు అని అర్ధం అవుతోంది. వచ్చే ఎన్నికలు పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా 33 శాతం మహిళల రిజర్వేషన్ కూడా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.

దాంతో వైసీపీ తాము ఈసారి ఎన్నికల్లో అతి పెద్ద విజయం సాధిస్తామని ఆయన ప్రకటించారు. అంతే కాదు 2019లో 151 సీట్లను ఎలా సాధించామో దానిని మించి ఘనమైన విజయం తమకు దక్కుతుందని ఆయన అంటున్నారు. అందులోసం భరీ వ్యూహాలను పార్టీ తరఫున రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో త్వరలో తమ కార్యాచరణను ప్రకటిస్తానని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

మరో వైపు చూస్తే కొత్త రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తాను అని విజయసాయిరెడ్డి వెల్లడిస్తున్నారు. గతంలో తమ ప్రభుత్వం పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయడంలో ఎంతో కృషి చేసిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడంలో ఏపీ సీఎం చంద్ర బాబు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి వైసీపీకి భారీ లక్ష్యాన్ని పెట్టేశారు. అది కూడా సీట్ల పెరుగుదల తరువాత కూడా వైసీపీ నూటికి తొంబై ఎనిమిది శాతం సీట్లను దక్కించుకుంటుందని ఆయన తనదైన రాజకీయ ధీమాతో కూడా అంచనాను వదిలారు. ఇక మీదట ఇదే వైసీపీ కొత్త నినాదం అవుతుంది. వై నాట్ 215 అని వైసీపీ నేతలు జనంలోకి వెళ్ళి తరచూ చెబుతారు అన్న మాట. మరి వై నాట్ 175 అంటే బూమరాంగ్ అయింది. ఇపుడు 215 టార్గెట్ ని టీడీపీ కూటమి ఎలా చీల్చిచెండాడుతుందో కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News