వైసీపీ ఉక్కిరిబిక్కిరి.. ఆ ఇద్దరి జోక్యం కోసం ...!

దాంతో ఇపుడు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తోంది.

Update: 2024-11-12 07:15 GMT

ఏపీలో అసలైన రాజకీయ ఆట మొదలైంది. వైసీపీ అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్నపుడు ఆ ఆట ఏంటో కాస్తా రుచి చూపించింది. నిజానికి అలాంటి ఆటలు తెలియకా కాదు చేయలేకా కాదు, టీడీపీ అనుభవం ఆ పార్టీ అధినాయకత్వం చాణక్యం చాలా గొప్పవి. అయినా సరే 2014 నుంచి 2019 వరకూ రాని ఉపద్రవం 2024 ఎన్నికల తరువాత వెంటనే వచ్చేసింది అంటే ఇదంతా వైసీపీ చేసుకున్నదే అని అంటారు చాలా మంది.

వైసీపీ టచ్ చేసి వదిలేస్తే టోటల్ గా ఆట చూపించేందుకు టీడీపీ కూటమి రెడీ అయింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు కట్టారు, అరెస్టులు చేశారు. వారిని ఇబ్బంది పెట్టారు, అయితే ఇది ఒకింత వరకే పరిమితం అయింది.

కానీ సోషల్ మీడియా విషయంలో ఒక చట్టం చేయాలని దానిని పదును పెట్టి అసభ్యత అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ తరఫున అయిదేళ్ల పాటు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని అందరినీ లిస్ట్ ఔట్ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.

ఏకంగా తవ్వి తీసి మరీ బయట వేస్తున్నారు. అయితే అవతల వైపు కూడా టీడీపీ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులూ ఏమీ తక్కువ తినలేదు కదా వారి సంగతి ఏమిటి అని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇపుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. వారు రాజకీయ వ్యూహాల ప్రకారం చేస్తారు. అవసరం అనుకుంటే కూటమి వైపు నుంచి కొందరిని అరెస్ట్ చేస్తారు. కానీ మెయిన్ డ్యామేజ్ అయితే వైసీపీకే తగులుతుంది, ఇది వాస్తవం.

దాంతో ఇపుడు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తోంది. ఎదురు దాడి చేస్తోంది. అయినా సరే ఈ అరెస్టులు అయితే ఎక్కడా ఆగడం లేదు, దాంతో వైసీపీ పూర్తిగా ఇబ్బందులు పడుతోంది.

ఆఖరుకు రాష్ట్రపతి గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వైసీపీ తన అధికార ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ మేరకు ఆ ఇద్దరికీ ఫిర్యాదులు కూడా చేసింది. గడచిన కొద్ది రోజులుగా జరుగుతున్న అరెస్టులతో వైసీపీ క్యాడర్ చెల్లా చెదురు అయిపోయారని ఏకంగా వంద మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కనిపించకుండా పోయారని ఆ పార్టీ రాష్ట్రపతికి గవర్నర్ కి ఫిర్యాదులు చేసింది.

ఏపీలో వాక్ స్వాతంత్రం అన్నది లేకుండా పోయిందని భయానక పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. కస్టడీ పేరుతో జరుగుతున్న నిర్బంధంతో వైసీపీ క్యాడర్ పూర్తిగా ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది.

ఏపీలో సోషల్ మీడియా క్యాడర్ మీద వందకు పైగా కేసులు నమోదు చేశారు అని వైసీపీ తెలిపింది. ఏకంగా పన్నెండు దాకా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు అని ఆరోపించింది. ఈ అరెస్టులు కేసులలో రాజకీయాలతో సంబంధం లేని విశ్లేషకులు విమర్శకులను కూడా తీసుకుని వస్తున్నారని వెల్లడించింది.

ఇక చూస్తే సోష‌ల్‌ మీడియా కార్యకర్తలపై బీఎన్ఎస్‌ సెక్షన్ 111(2)ని ప్రయోగిస్తున్నారని ఇది చాల అన్యాయమని పేర్కొంది. ఈ తరహా చర్యల వల్ల రాజ్యాంగ స్వేచ్ఛ ఉండదని, అలాగే సుప్రీంకోర్టు తీర్పులను సైతం పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు అని రాష్ట్రపతికి గవర్నర్ కి చేసిన ఫిర్యాదులో వైసీపీ పేర్కొంది. ఏపీలో న్యాయాన్ని కాపాడానికి, భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాల‌ని అభ్యర్థిస్తున్నామని వైసీపీ ట్వీట్ చేసింది.

మొత్తం మీద చూస్తే కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వైసీపీ క్యాడర్ డీ మోరలైజ్ అవుతోంది. అధినాయకత్వం చివరికి రాజ్యాంగ సంస్థల అధిపతులను జోక్యం చేసుకోమని కోరుతోంది. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రాజకీయాల్లో వికృత క్రీడలకు ఎవరూ తెర తీయకూడదు, అది ఒకరు ఆరంభిస్తే మరొకరు మరింత జోరు చేస్తారు. ఇది ఏపీలో అడుగడునా రుజువు అవుతొంది అని మేధావులు అంటున్నారు.

Tags:    

Similar News