ఏపీలో వైసీపీదే విజయం... తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే!
ఈ నేపథ్యంలో... వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ కూడా తాజాగా విడుదలైంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి స్టార్ట్ అయిన వేళ.. ఓటరు నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్ధలు, జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ పరిస్థితిపై తమ ఒపీనియన్ పోల్స్ ని వెల్లడించాయి. వాటిలో మెజారిటీ ఫలితాలు వైసీపీకే జై కొట్టాయి.. మరోసారి ఏపీలో జగన్ పాలన కన్ ఫాం అని తెలిపాయి!
అవును... ఎన్నికలు సీజన్ వచ్చిందంటే ఆయా పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితో పాటు సర్వే సంస్థల సందడి కూడా నెలకొంటుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపైనా తమ అంచనాలను పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో... వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ కూడా తాజాగా విడుదలైంది.
ఈ పోల్ ఆఫ్ పోల్స్ లో ఏబీపీ, జీ న్యూస్, ఇండియా టీవీ, టైమ్స్ వంటి ఛానళ్లు ఇచ్చిన సర్వేల్ని కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గిరా గిరా తిరబోతుందని వెల్లడించింది. ఈ క్రమంలో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీచేసినా విజయం జగన్ నే వరించనుందని వెల్లడించింది.
ఇందులో భాగంగా... రానున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని.. కూటమి 9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనూ కనిపించబోతోందని క్లారిటీ ఇచ్చింది. ఆ లెక్కన యావరేజ్ గా చూసుకుంటే... 112 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా.. కూటమి 63 సీట్లకు పరిమితమవుతుందని భావించొచ్చన్నమాట!
కాగా... రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయం అని వైసీపీ పూర్తి ధీమాగా చెబుతున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతా ఇచ్చిన హామీల్లో 95శాతానికి మించి అమలు చేశామని.. జగన్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదనే పేరు సంపాదించుకున్నామని.. కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న సమయంలోనూ సంక్షేమ ఫలాలు ఆగలేదని.. అవన్నీ ప్రజలకు తెలుసని వైసీపీ ధీమాగా చెబుతుంది.
ఇదే సమయంలో జగన్ సర్కార్ చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి! ఇక గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ ప్రభుత్వ హయాంలో... 4 ఓడరేవులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ తో పారిశ్రామిక ప్రగతి సాధించామని చెబుతున్నారు.
ఫలితంగా... పారిశ్రామికాభివృద్ధి రేటులో రాష్ట్రం 2018-19 నాటికి 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా.. 2021-22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకిందనే విషయం కేంద్రప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగానే రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపు తథ్యం అని నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాలు కూడా ఏపీలో మళ్లీ జగనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు!
ఇలా జాతీయ, ప్రాంతీయ సంస్థలు నిర్వహిస్తోన్న సర్వేల్లో మరోసారి ఏపీలో వైసీపీదే అధికారం అని చెబుతున్న వేళ... జూన్ లో ఈసారి జగన్ ప్రమాణ స్వీకారం ఏ రేంజ్లో, ఎక్కడ జరపబోతున్నారనే చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైందని తెలుస్తోంది!