ఈడీకి ఫైన్ షాకిచ్చిన బాంబే హైకోర్టు
ఈడీ పెట్టిన కేసు విషయంలో బాంబే హైకోర్టు అక్షింతలు వేయటమే కాదు.. ఈడీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మోడీ సర్కారు పుణ్యమా అని ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) గురించి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈడీని ఫేమస్ చేసిన ఘనత మాత్రమే మోడీషాలకే చెల్లుతుంది. అయితే.. ఇక్కడ ఈడీ గురించి ప్రత్యేకంగా ఒక అంశాన్ని చెప్పి విషయంలోకి వెళతాం. ఎవరి మీదనైనా కేసు పెట్టే విషయంలో ఈడీ చాలా గట్టిగా హోంవర్కు చేస్తుందని.. తొందరపాటుకు గురి కాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం గురించి తెలిస్తే మాత్రం.. కాస్తంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఎందుకుంటే.. ఈడీ పెట్టిన కేసు విషయంలో బాంబే హైకోర్టు అక్షింతలు వేయటమే కాదు.. ఈడీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన ఈడీకి రూ.లక్ష జరిమానా విధిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు షాకిచ్చేలా మారింది. ఇంతకూ అసలు విషయం ఏమంటే.. రాకేశ్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ పై నిబంధనలు ఉల్లంఘన.. మోసం ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్ లో నమోదైంది.
దీని ఆధారంగా రాకేశ్ జైన్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. 2014 ఆగస్టు నాటి ఈ కేసుకు సంబంధించిన నోటీసులను జారీ చేసింది. దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు రాకేశ్ జైన్. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..ఈడీకి తలంటింది. బలమైన కారణం లేకుండా మనీలాండరింగ్ కేసులు ఎలా నమోదు చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలు పని చేయాలని పేర్కొంది. అంతేకాదు.. వారు గీత దాటితే ఇబ్బందులు తప్పవన్న సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్ తో కూడిన సింగిల్ బెంచ్ అభిప్రాయ పడింది ఈ క్రమంలో ఈడీని మందలించిన బాంబే హైకోర్టు.. రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వైనం ఈడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.