నిన్న 10 ఏళ్లు.. నేడు 14 ఏళ్ల జైలుశిక్ష!
ఇప్పుడు ఈ పదేళ్ల జైలుశిక్ష చాలదన్నట్టు తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది
పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆ దేశ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అధికారిక పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఇమ్రాన్ ఖాన్ తోపాటు, ఆయన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన మహ్మద్ షా ఖురేషీకి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ పదేళ్ల జైలుశిక్ష చాలదన్నట్టు తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆయనతోపాటు ఆయన భార్యకు కూడా శిక్ష పడటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన తరఫున పార్టీ వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేయగా అధికారులు తిరస్కరించారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ మరో కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఈ మూడేళ్లకు తోడు అధికారిక పత్రాల రహస్యాల కేసులో పదేళ్ల జైలుశిక్ష పడింది.
ఈ మూడేళ్లు, పదేళ్ల జైలుశిక్షలు చాలవన్నట్టు ఇంకో కేసులో తాజాగా 14 ఏళ్ల జైలుశిక్ష పడటం హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజా శిక్ష..
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలకు సంబంధించింది. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఆయనకు కోర్టు శిక్ష విధించింది.
పాక్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని తీసుకోవచ్చు.
అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే మరికొన్ని బహుమతులను తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేసుకున్నారని అభియోగాలు వచ్చాయి. మొత్తం మీద దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తం చెల్లించి ఇమ్రాన్ వాటిని సొంతం చేసుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి.
కాగా పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆయనకు వరుసగా శిక్షలు పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవేకాకుండా ఆయనపై మరో 150 కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా ఈ శిక్షలపై తాము ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేస్తామని ఇమ్రాన్ న్యాయవాది వెల్లడించారు.